వరుణయాగాలకు వర్షాలు రావు
జేవీవీ నాయకుడు ప్రసాదరావు
మేడ్చల్ , ఆగస్ట్ 10 (విజయ క్రాంతి): వర్షాలు కురవడానికి, వరుణయాగాలకు ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదని మేడ్చల్ జనవిజ్ఞాన వేదిక నాయకుడు వరప్రసాదరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సూర్యుని వేడిమికి సముద్రాలు, నదుల నీరు ఆవిరిగా మారి గాలిలో కలవడం, ఆ వేడి గాలి పైకి ప్రయాణించి పీడనం తగ్గినప్పుడు చల్లబడి నీటి బిందువులుగా మారడం అనేది పూర్తిగా సహజ సిద్ధమైన సైంటిఫిక్ ప్రక్రియ అని ఆయన వివరించారు.
ఐస్ గ్లాసు బయట వాతావరణంలోని తేమ నీటి చుక్కలుగా మారినట్లే, ఆకాశంలో కూడా చల్లదనం ఏర్పడినప్పుడే మేఘాలు కరిగి వర్షం పడుతుందన్నారు. ఇందుకు కావలసిన చల్లదనం వాతావరణంలో ఏర్పడాలంటే విపరీతంగా చెట్లను నాటడం, అడవులను సంరక్షించడం ఒక్కటే మార్గమని, కొన్నిసార్లు ఎల్ నినో వంటి పర్యావరణ ప్రభావాల వల్ల కూడా వర్షాలు కురవకపోవచ్చని తెలిపారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వాలే మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా వరుణయాగాలు,
పూజలు చేయడం అవాంఛనీయమని ఆయన విమర్శించారు. వర్షం పడితే యాగాలు చేయడం వల్లే పడిందని ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. సంస్కృతిలో భాగంగా ప్రజలు ఏమైనా చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే ప్రభుత్వాలు మాత్రం సోషల్ ఫారెస్స్ట్రీ, అటవీ సంరక్షణ చర్యలను పెంపొందింపజేస్తూ ప్రజలకు సరైన మార్గదర్శకంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.






