29 August, 2026 | 1:10 AM

ఇంచార్జ్జీల పాలన ఇంకెన్నాళ్లు?

29-08-2026 12:00 AM

మఠంపల్లి ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ

పది గ్రామ పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శులే

ఖాళీలు భర్తీ చేయాలని స్థానికుల వేడుకోలు

మఠంపల్లి ఆగస్టు 28: మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కీలకమైన ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన వ్యవస్థ ఇన్చార్జిల చేతుల్లో నడుస్తోంది. ముఖ్యంగా ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కార్యాలయ పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు, ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో శాశ్వత అధికారులు లేకపోవడంతో ఇన్చార్జి పాలన కొనసాగుతోంది. దీంతో వివిధ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు,గ్రామ పంచాయతీలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు సకాలంలో పూర్తవుతున్నా యా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పది గ్రామ పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శులే

మరోవైపు మండల పరిధిలోని దాదాపు 10 గ్రామ పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శులు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలు స్తోంది. ఒకే కార్యదర్శికి ఒకటి కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో పని భారం గణనీయంగా పెరిగింది.రోజువారీ పరిపాలనతో పాటు పంచాయతీ అభివృద్ధి పనులు,పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు,ప్రభుత్వ కార్యక్రమాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుండటంతో కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

పనిభారం పెరిగితే.. పాలన ఎలా కష్టతరం

ఒక కార్యదర్శి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల బాధ్యతలు చేపట్టడం వల్ల ఆయా గ్రామాల్లో ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించి ప్రతి గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయి కార్యదర్శులను నియమించాలని వారు కోరుతున్నారు.

ఖాళీలను భర్తీ చేయాలి 

మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఇన్చార్జి ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, ఇన్చార్జి బాధ్యతలతో నెట్టుకొస్తున్న గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి కార్యదర్శులను నియమించాలి. అప్పుడే పాలనపరంగా ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవు.

భూక్యా పాండు నాయక్ 

సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు