బాధిత కుటుంబానికి అండగా ఉంటాం -
- నేపాల్ వరదల్లో ఎల్బీనగర్‌కు చెందిన సుహాసిని రెడ్డి గల్లంతు
- టీపీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి
ఎల్బీనగర్, ఆగస్టు 28 : నేపాల్లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో ఎల్బీనగర్ లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గల్లంతవడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి న్యూజిలాండ్ దేశానికి చెందిన పౌరసత్వం ఉన్నారని, ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆమె... తన స్నేహితులతో కలిసి నేపాల్ పర్యటనకు వెళ్లిన సమయంలో వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు.
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ సూచనల మేరకు శుక్రవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వాస్తుకాలనీలో ఉంటున్న సుహాసిని రెడ్డి కుటుంబ సభ్యులను, ఆమె తండ్రి మహేందర్ తదితరులను కలిసి పరామర్శించారు. ఎవరూ అధైర్యపడొద్దని, సుహాసిని రెడ్డి ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని, గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. సుహాసిని రెడ్డి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు.






