బీటీపీఎస్ రోడ్డు .. మృత్యు రహదారి..!
- బొగ్గు, ఇసుక లారీలతో అతలాకుతలం
- ప్రమాద భరితంగా మారిన రహదారులు
- పరిశ్రమ పరిధిలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానం
- పట్టించుకోని అధికారులు
మణుగూరు, ఆగస్టు 28 (విజయక్రాంతి): బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లోని రహదారులు వాహనదారులకు, ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గు, ఇసుక రవాణా చేసే భారీ లారీల రాకపోకలతో రహదారులు నిత్యం రద్దీగా మారుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడికి పలుచోట్ల రోడ్లు దెబ్బతిని గుంతలమయంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే మణుగూరు ప్రాంతంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇసుక లారీలు రహదారులపై వరుసగా నిలిచిపోవడంతో అత్యవసర వాహనాలకు సైతం దారి లేకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి విపరీతంగా ఎగసిపడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రహదారులపై గుంతలు, మలుపులు, సరైన సూచిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
బీటీపీఎస్ పరిశ్రమ పరిధిలోని అంతర్గత రహదారుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమకు నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రహదారుల నిర్వహణపై తగిన శ్రద్ధ లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళి, ఇసుకతో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి రహదారులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు. భారీ లారీలతో పాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఒకే మార్గంలో ప్రయాణించాల్సి రావడం ప్రమాదాన్ని పెంచుతోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడిన రహదారి సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల మణుగూరు ప్రాంతంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అత్యవసర వైద్య సేవలపై కూడా ప్రభావం పడిన ఘటనపై తీవ్ర చర్చ జరిగింది.
ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రవాణాపై కఠిన నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉంది. భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేక సమయాలు, మార్గాలను నిర్ణయించాలని ప్రజలు సూచిస్తున్నారు. లారీలను రహదారులపై ఇష్టారాజ్యంగా నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు, ఇసుక రవాణా వాహనాలకు వేగ నియంత్రణతో పాటు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నారు.
రోడ్డు పక్కన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరిశ్రమ పరిధిలోని రహదారులను నిత్యం పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. రోడ్ల నిర్వహణకు బాధ్యత వహించే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బీటీపీఎస్ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. భారీ వాహనాల వల్ల దెబ్బతిన్న రోడ్లను గుర్తించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు భద్రతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్నారు. పరిశ్రమకు రాకపోకలు సాగించే వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, ఓవర్లోడి్ంప తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
ఓవర్లోడ్తో బొగ్గు, ఇసుక తరలించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లారీల రాకపోకల కారణంగా దెబ్బతింటున్న రోడ్లకు సంబంధించి బాధ్యత ఎవరిదనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజా రహదారులు పరిశ్రమల అవసరాలకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజల ప్రయాణానికి కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు సైతం సులభంగా వెళ్లేలా మార్గాలను అందుబాటులో ఉంచాలని అంటున్నారు. రహదారి భద్రతపై నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బీటీపీఎస్ పరిధిలోని రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి వెం నే మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రహదారులను సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీటీపీఎస్ రహదారులు మృత్యువు బాటలుగా మారకముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






