నిత్య ఉగాదిని కలగందాం!
16-03-2026 12:00 AM
వానా కాలాన్ని పోగొట్టుకున్నా
చలి కాలపు ఆహ్లాదాన్ని చేజార్చుకున్నా
ప్రకృతి చిగురేయడం
కాలాన్ని ఎదిరించడమే!
ఆకాశం నిప్పులు కురిపిస్తున్నా
గాలి అగ్ని శ్వాస వెదజల్లుతున్నా
స్థిరంగా నిలబడి చెట్టు నీడనివ్వడం
ఆత్మవిశ్వాస ప్రతీకనే!
ఎగుడు దిగుడు దారుల వెంట
గాయాలకు వెరువని
పాదాల ప్రయాణం
ఉగాదులను ఉపద్రవాలను గేలిచేయడం
కొత్త వెలుగులకు
బాటలు వేయడమే!
అడవులను ఎడబాసిన మనుషులు
తుపాకులను వదిలేయవచ్చు
ఆశయాలను వదిలేయరు
జనారణ్యంలో అడవులై విస్తరిస్తారు!
తారతమ్యాలు
సమసిపోనంత కాలం
ఉగాదులన్నీ ఒకనాటి
పండుగలే
సమ భావన పరిఢవిల్లినచోట
నిత్య ఉగాదులు ఊరేగుతాయి!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి




