తల్లి బాధ నుంచి గిరిజన చైతన్యం వరకు — కూతురు రాంరెడ్డి 'నీరడి మడి' కథల సమీక్ష!
ఇప్పటికే ఐదు కథాసంపుటాలను వెలువరించి, సాహిత్య ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలపర్చుకున్నవారు కూతురు రాంరెడ్డి. ‘నీరడి మడి’ ఆయన ఆరో కథాసంపుటి. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ సాహిత్య ప్రయాణం ఆయనది. కథలతో పాటు కవిత్వ రచన కూడా సాగిస్తోన్న రాంరెడ్డి యోగాపై కూడా సాధికారిక గ్రంథాన్ని వెలువరించారు. సామాజిక వాస్తవికత, గ్రామీణ నేపథ్యం, పట్నం సొగసులు, విదేశీ మెరుపులు, సందర్భోచిత సంభాషణలు ఆయన కథల్లో పుష్కలంగా కనబడతాయి.
ఆయన కథలకు ప్రత్యేకత కల్పిస్తాయి. కరీంనగర్ జిల్లా గ్రామీణ నేపథ్యంలో గడిపిన బాల్యం. వ్యవసాయ, ఆబ్కారీ శాఖలలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యోగ అనుభవం. హైదరాబాద్ మహానగర శివారు వాతావరణంలో నివాసం. పిల్లల కోసం అమెరికా ప్రయాణం రాంరెడ్డి కథలను చాలా ప్రభావితం చేసిన అంశాలు. ప్రతీకలతో కథాకథానాన్ని బలంగా పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చెప్పడం కూతురు రాంరెడ్డి కథలలో కనబడే ఒక లక్షణం.
ఈ కథాసంపుటిలోని ‘నీరడి మడి’ కథను అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కథానాయకుడి తల్లి అనారోగ్యానికి గురవుతుంది. దాంతో కథానాయకుడు ఉద్యోగానికి సెలవు పెట్టి తల్లి దగ్గరికి బయలుదేరతాడు. తల్లి ఎలా ఉందోననే ఆందోళనతో ఉంటాడు.ఈ ఆందోళనకు ప్రతీకగా రైలు ప్రయాణం సందర్భంలోని వాతావరణాన్ని తెలియజేస్తారు రచయిత. ఆ సమయంలో వర్షాలు, వరదలు, వాతావరణ హెచ్చరికల కారణంగా రైలు నెమ్మదిగా నడుస్తుంది.
ఇక్కడ కథానాయకుడి గుండెలో బాధను వరద పరిస్థితులకు అన్వయించారు రచయిత. కథ చివర్లో తనకున్న 33 గుంటల భూమిని తన బావ పేర మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాడు కథానాయకుడు. కూతురి కుటుంబ పరిస్థితుల వల్ల ఆవేదనకు గురైన కథానాయకుడి తల్లికి ఆ నిర్ణయం ఒక పెద్ద ఊరట. అందుకే ఆమెకు దిగులు దూరమవుతుంది. ఆరోగ్యవంతురాలవుతుందని రచయిత చెప్పకనే చెప్తారు.
అప్పుడు తిరుగు ప్రయాణమైన కథా నాయకుడి ప్రయాణం హాయిగా సాగుతుంది. వడగాల్పులూ వరదలూ అసలే ఉండవు. ఆ ప్రశాంత వాతావరణం ప్రశాంతత నెలకొన్న కథా నాయకుడి హృదయానికి ప్రతీక. ‘నా కొడుకులు’ కథ ఒక వృద్ధుడి కథ. తల్లిదండ్రులను వంతులవారీగా పంచుకునే పిల్లలకు కనువిప్పు కలిగించే కథ ఇది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా కేవీ రమణాచారి ఆధ్వర్యంలోని ‘ఆనందాశ్రమం’ ప్రస్తావన కూడా ఈ కథలో ఉంది.
కథలో చిన్న కొడుకు ఇంటికి చేరిన తండ్రిని ఎవరో కిటికీలోంచి తొంగి చూసి వెంటనే కిటికీ మూసివేస్తారు. తండ్రికి ఆ ఇంట్లో లభించే స్పందనకు ఈ దృశ్యం ప్రతీక. మొదట్లో ఊతకర్ర సహాయంతో అడుగులు వేస్తాడు తండ్రి. కొడుకుల ఆదరణ అప్పడు అవసరం అనేందుకు ఈ ప్రతీకను ఉపయోగించుకున్నారు రచయిత. చివర్లో ఊతకర్ర అవసరం లేకుండా చెరోవైపు ఉండి తండ్రిని నడిపిస్తారు కొడుకులిద్దరూ.
తాత్కాలికంగా వారిద్దరూ నడిపించినా భవిష్యత్తులో తండ్రి కోసం పెట్టే వృద్ధాశ్రమ నిర్వహణతో తనంతతాను కాలం వెళ్లదీసుకునే శక్తిమంతుడయ్యాడనడాన్ని ఈ ప్రతీక పాఠకుడికి కళ్లకు కట్టినట్టు తెలియజేస్తుంది. మహిళల పట్ల ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే అధములకు గుణపాఠం ఎలా చెప్పాలో వివరించే కథ ఈ సంపుటిలోని మొదటి కథ ‘అతడు మార్గదర్శి’. ఈ కథలో నాయకి గ్రామీణ గిరిజన స్త్రీ మేస్రం జంగు బాయి.
గిరిజనుల్లో చైతన్యం కలిగించిన మార్గదర్శిగా ఉన్నత విద్యావంతుడు సూర్యనారాయణ మూర్తి పాత్రను తీర్చిదిద్దారు రచయిత. గిరిజనులపై పరిశోధన చేసి, డాక్టరేటు పొందడంతో సంతృప్తి చెందకుండా గిరిజనుల్లో చైతన్యాన్ని కలిగించేందుకు కృషి చేస్తాడు సూర్యనారాయణ మూర్తి. అతని మాటలతో, బోధనలతో ప్రభావితమైన జంగుబాయి తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురిచేసిన తాగుబోతుకు జీవితాంతం గుర్తుండిపోయేలా శిక్ష విధిస్తుంది.
ప్రజలను చైతన్యవంతులను చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సూర్యనారాయణమూర్తి ముందుంటాడని ముగింపులోని కొసమెరుపు ద్వారా తెలియజేశారు రచయిత. ఈ కథ సాంతం గిరిజనుల ఆచార వ్యవహారాలు, సమస్యలను తెలియజేస్తుంది. బస్సు కూడా రాని గిరిజన ఆవాస ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలు వివరించే కథ ఇది. ‘నీరడి మడి’ కథ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తెలంగాణ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణంతో ప్రారంభమవుతుంది.
తల్లి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో కథానాయకుడు తాను ఉద్యోగం చేస్తున్న ఢిల్లీ నగరం నుండి బయలుదేరతాడు. తల్లి ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత సికింద్రాబాదు నుండి ఢిల్లీకి అదే తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కథా నాయకుడి తిరుగు ప్రయాణంతో కథ ముగుస్తుంది. చక్కటి శైలితో గ్రామీణ పలుకుబడులను, గ్రామీణ వాతావరణాన్నికథల్లో ప్రతిఫలించేలా చేస్తున్న కూతురు రాంరెడ్డి మరెన్నో చక్కటి కథలతో సాహిత్యయాత్ర సాగించాలని సాహిత్యాభిమానుల ఆకాంక్ష.
డా.సూర్యప్రకాశ్‌రావు
94410 46839




