calender_icon.png 12 February, 2026 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకులు.. దేవుళ్లా?

12-02-2026 02:03:13 AM

  1. నిద్ర లేవగానే దరిద్రపు మొహాలేనా.. 
  2. నేతల పోస్టర్లు, బ్యానర్లపై కామారెడ్డి ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ 
  3. వ్యక్తిగత అభిమానం, ఆరాధనపైనా విసుర్లు 
  4. నాయకుల బాధ్యత ప్రజా సేవ చేయడమే.. 
  5. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు వైరల్

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ‘నాయకులు, ప్రజాప్రతినిధులు ఏమైనా దేవుళ్లా..? ప్రతి రోజు నిద్ర లేవగానే దరిద్రపు మోహాలే.. పోస్టర్లు, బ్యాన ర్లపై కనిపిస్తున్నాయి. ఇలా పోస్టర్లు పెట్ట డం వల్ల నాయకుల్ని దేవుళ్లలా భావించే పరిస్థితి వస్తోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులను దేవుళ్ల స్థాయికి తీసుకెళ్లడం సరికాదు. ఆఖరికి పండుగల సమయంలో పంచే గణపతి లడ్డూలపై కూడా రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రిస్తుస్తున్నారు..  ‘గణపతి లడ్డూలపై కూడా వారి ఫొటోలు పెడుతున్నారు.

ఇది భక్తి కాదు, స్వప్రచారం. పూజ చేయడానికి నాయకుల ఫొటోలు అవసరమా?’ అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి  భారత రాజకీయాల్లో పెరిగిపోతున్న ‘నాయకుల పూజ’ సంస్కృతిపై చేసిన తీవ్ర విమర్శలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రముఖ నాయకుల పోస్టర్లు రోడ్లపై, కాలువల్లో పడిపోతున్నాయని ప్రస్తావించారు.

‘మోదీజీ పోస్టర్లు కూడా కాలువల్లో పడి పోతాయి. ఆయన నాయకుడు కాదా? నాయకులు వస్తారు.. వెళ్తారు. వారు సేవ చేయడానికి ఉన్నవారే గాని పూజించుకోవడానికి కాదు’ అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. ‘బానిస భజన బృందా లు ఆగాలి. పని చూసి ఓటేయండి, వ్యక్తి పూజ చూసి కాదు’ అంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. 

గంటల్లో 14వేలకు పైగా వ్యూస్..

మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇటీవల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రసంగం వీడియోను బీజేపీ కార్యకర్త సాఫ్రన్ సాగర్ గౌడ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు 14 వేలకు పైగా వ్యూస్, వందల లైకులు, రీ పోస్టులు వచ్చాయి. దీంతో రాజకీయ భజన, నాయకుల ఆరాధనపై ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది.  

సోషల్ మీడియాలో మద్దతు..

సుమారు నాలుగు నిమిషాల ఈ ప్రసంగాన్ని సాఫ్రన్ సాగర్ గౌడ్ ‘ఈ ప్రసంగం ఆలోచింపజేస్తుంది. చూడండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ పోస్టుకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కొందరు రమణారెడ్డి స్పష్టంగా మాట్లాడారని ప్రశంసించారు. ‘ఆలోచనలో స్పష్టత ఉంది, సామాన్యుడి శైలిలో మాట్లాడారు’ అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి ‘మీరు మా మనసులో మాట చెప్పారు. ప్రతి ఉదయం పోస్టర్లు, భజన బృందాలు, సైరన్లు విసిగిస్తున్నాయి’ అని రాసుకొచ్చారు. 

బీజేపీని భిన్నంగా చూపించేలా..

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన ఈ ప్రసంగం బీజేపీని ఇతర పార్టీల నుంచి భిన్నంగా చూపించే వ్యూహంగా కనిపిస్తోంది. వంశపారంపర్య, వ్యక్తి ఆధారిత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలకు ఇది ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నమని అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ రవి కుమార్ దీనిపై స్పందిస్తూ ‘ఇది ప్రజాస్వామ్యంలో పరిపక్వత అవసరమని ఇచ్చిన పిలుపు. అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకులపై వ్యక్తిగత అభిమానం బలంగా ఉన్న రాష్ర్టంలో ఇలాంటి సందేశాలు కొంతమంది అనుచరులను దూరం చేసే అవకాశం ఉంది’ అన్నారు.అయితే ఈ వీడియో రాజకీయ ఆర్భాటాలపై విసుగెత్తిన ఓటర్లలో మాత్రం ఆలోచన రేకెత్తించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.