టైటిల్‌లోనే కథ వివరిస్తూ..
థియేటర్‌లో లైట్లు ఆరిపోతాయి.. తెరపై రంగులు మారుతుంటాయి. మ్యూజిక్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారిగా సినిమా పేరు పడుతుంది. ఆ అక్షరాల రూపం చూసి ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. ఆ అక్షరం వెనుక ఉన్న ఆలోచన ఎవరిది? అని వెతికితే తెలుగు చిత్రసీమలో వినిపించే ఏకైక పేరు విష్ణువర్ధన్ రెడ్డి మావురపు. నేడు వెండితెరపై మెరిసే అగ్ర తారల సినిమాలకు ఆయన గీతలే బ్రాండ్ ఇమేజ్. చేతి రాతలోని వంపును, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లోని మెరుపును జోడించి తెలుగు సినిమా టైటిల్స్ రూపురేఖలను మార్చేయడమే తన సక్సెస్ మంత్ర అని చెప్తున్న వివరెడ్డి ప్రయాణం స్ఫూర్తిదాయకం.
-నరేశ్ ఆరుట్ల
సినిమా చూడకముందే ప్రేక్షకులతో మాట్లాడేది ‘టైటిల్ కార్డ్’ మాత్రమే. టైటిల్ అనేది పేరు మాత్ర మే కాదు, అది ఆ సినిమా ఆత్మ. దర్శకుడి విజన్‌ను ఒక్క టైటిల్‌లో చూపించడం కత్తిమీద సా ము లాంటిదే. ఒక టైటిల్ కార్డ్ కోసం ఓ కళాకారుడు వందల సంఖ్యలో స్కెచ్‌లు వేయాల్సి వస్తుం ది. ఒక అక్షరం వంపు కోసం రోజుల తరబడి కష్టపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ, తన కెరీర్‌లో మాత్రం అలాంటి సందర్భాలు చాలా తక్కువ అంటారు వివరెడ్డి. అదేమంటే, ‘అది గాడ్ గిఫ్ట్’ అంటూ క్రెడిట్ దేవుడికిస్తాడీ అక్షర బ్రహ్మ.
ఓరగల్లు నుంచి హైదరాబాద్ దాకా..
వివరెడ్డి స్వస్థలం వరంగల్‌లోని ఎల్‌బీనగర్. నాన్న నారాయణరెడ్డి.. ‘వివ’కు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే శాశ్వతంగా దూరమయ్యారు. అప్పట్నుంచీ ‘వివ’ను, వాళ్ల అన్నయ్యను వాళ్ల అమ్మ ప్రమీలాదేవి అన్నీ తానై పెంచారు. ఇప్పుడామె వరంగల్‌లో సోషల్ వర్కర్. చిన్నప్పుడు పలకాబలపం చేతికి దొరికితే చాలు ఏవేవో గీతలు గీస్తూ, చిట్టిపొట్టి బొమ్మలు వేసేవారు వివరెడ్డి. ఒక విధం గా ఆ గీతలే అతని రాత మార్చాయని చెప్పొచ్చు. టెన్త్‌లో ఉన్నప్పుడు బాలల అకాడమీ నుంచి చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకు న్నారు. అలా చిరుప్రాయంలోనే అతనిలో జన్మ తః అంతర్లీనంగా దాగి ఉన్న సహజసిద్ధ కళాకారుడికి దక్కిన తగిన గుర్తింపు దక్కింది. బడికి వెళ్లేదారిలో కొత్తగా ఏ సినిమా పోస్టర్ కనిపించినా, ఠపీమని ఆగిపోయేవాడు.
ఆ బొమ్మలు, ఆకర్షణీయమైన రాతలు.. వాటిని చూస్తూ అలాగే ఉండి పోయిన సందర్భాలెన్నో. సినిమా అనే మాధ్య మం.. ‘వివ’ని ఎంతలా ఆకర్షించిందంటే, వరంగల్‌లో ‘మగాళ్లకో నమస్కారం’ అనే సినిమా షూ టింగ్ జరిగితే, బడి ఎగ్గొ ట్టి మరీ వెళ్లి చూసేతంగా! వయసు పెరిగేకొద్దీ సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఉన్నత చదువుల పేరుతో పట్నం బాటపట్టాడు. ఓ వైపు డిగ్రీ చదువుకుంటూనే, తన కళాతృష్ణను తీర్చుకునేందుకు జేఎన్‌టీ యూలో బీఎఫ్‌ఏలో చేరాడు. ఫైన్ ఆర్ట్స్ రం గంవారితో సత్సంబంధాలు నెరపుతూ వచ్చారు.
ఆ క్రమంలోనే తన సీనియర్, ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌తో పరిచయం ఏర్పడింది. ఓసారి ఏలె లక్ష్మణ్ సోదరుడు ధని ఏలె ఒక లోగో రాస్తున్నప్పుడు అక్కడే ఉన్న వివరెడ్డిని ‘నువ్వోసారి ట్రై చేస్తావా..’ అంటూ పురమాయించారు. అలా ఆయన రాసిన లోగోను ఏలె లక్ష్మణ్ ఓకే చేశారు. ఆ లోగోనే నితిన్ హీరోగా పరిచయమైన ‘దిల్’ సి నిమాది. అప్పట్నుంచి సినిమా లోగోలు రాయడం కెరీర్‌గా మారింది. టాలీవుడ్‌లో 90 శాతం డిజైనర్లకు వివరెడ్డి లోగోలు రాసిచ్చారు. తర్వాత పబ్లిసిటీ డిజైనర్‌గా నూ మారి, నటుడిగా నూ ప్రతిభ కనబర్చుతున్నారు.
ఆ హిట్ మూవీ టైటిల్స్ ‘వివ’ రాసినవే..
చిత్రలేఖనం, లోగో రూపకల్పన, పబ్లిసిటీ రూపకల్పన, నటన.. ఈ నాలుగు రంగాల్లో ‘వివ’ ప్రతిభ కనబర్చుతున్నారు. ‘దిల్’తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం ఇప్పటిదాకా 600 సినిమాలకు లోగోలో చేసేలా చేసింది. శివమణి, అర్జున్, చంద్రముఖి, పరమవీరచక్ర, బొమ్మరిల్లు, పరుగు, శంకర్ దాదా జిందాబాద్, గుడుంబా శంకర్, దేశముదు రు, పోకిరి, రక్తచరిత్ర, సూపర్, ఆర్య 2 వంటి అనేక విజయవంతమైన చిత్రాల లోగోలు వివరెడ్డి రాసినవే కావడం విశేషం. 100కుపైగా సిని మాలకు పబ్లిసిటీ రూపకర్తగానూ పనిచేశారు వివరెడ్డి.
నటుడిగానూ..
నటుడిగానూ ‘వివ’ తెరపై అలరిస్తున్నారు. బాపు, లగ్గం వంటి సినిమాలు, మోతెవరి లవ్ స్టోరీ, డాటర్ ఆఫ్ ప్రసా ద్ వంటి సిరీస్‌ల్లో నటించారు. ‘ఓ తండ్రి తీర్పు’ లో వివరెడ్డి లీడ్ రోల్ పో షించారు. ఆయన న టించిన ‘మారెమ్మ’ రిలీజ్‌కు ఉంది. ‘అట్లాస్ సైకిల్ అత్తగారు వెట్డలే’లో హీరో బావ క్యారెక్టర్‌లో అలరించనున్నారు. ‘ఓ మాట అనుకుందామా’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘3 2 1’, ‘సర్కార్ బాయి’, ‘నికుంబల’ సినిమాల్లోనూ వివరెడ్డి భాగమయ్యారు.
ఏ టెక్నాలజీ వచ్చినా చేతిరాతదే తొలిస్థానం: వివరెడ్డి
సినిమా పేరును, దాని అర్థాన్ని దృష్టిలో ఉంచుకొని లోగో డిజైన్ చేస్తా. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, పోయెటిక్‌గా ఉందా.. అనేదాన్ని బట్టి నా ఆలోచనతోనే ముందుకెళ్తా. నేను లోగోను ఇప్పటికీ మ్యాన్‌వల్‌గానే రాస్తా. నా భార్య లతారెడ్డి డిజైనింగ్‌లో నాకు సహకరిస్తుంటుంది. ప్రత్యేక టీమ్ కూడా ఉంటుంది. ఎప్పటికైనా చేతిరాతదే తొలి స్థానం.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా చేతిరాతకున్న ప్రాముఖ్యత పోలేదు. చిత్రపరిశ్రమలో పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే, ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది. నటుడిగానైనా, సాంకేతిక సిబ్బందికైనా ముందు పరిచయం ఉంటే ఎంట్రీ దొరకుతుంది. తర్వాత టాలెంట్ ఉంటే నిల్చోవడం, లేకపోతే వెనక్కి వెళ్లిపోవడం తప్పదు.
మీకు తెలుసా?
టెక్నాలజీ మారుతున్నా, ట్రెండ్స్ మారుతున్నా.. అక్షరాల అల్లికలో వివరెడ్డి ముద్ర ఎప్పటికీ ప్రత్యేకం. అందుకే ఆయన అరుదైన కళకు దక్కిన ప్రశంసలు, పురస్కారాలు బోలెడు! ‘దాసరి 150వ సినిమా పరమవీరచక్ర లోగో చూసి ‘నెల రోజుల నుంచి ఎవరి తోనూ కాలేదు.. చాలా అద్భుతంగా చేశావ్’ అంటూ గురువుగారు ప్రశంసించిన క్షణాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు వివ. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా లోగో అచ్చం బాపులాగా డిజైన్ ఉందంటూ డైరెక్టర్ వంశీ తనను ప్రశంసించటం.. ‘గోపి గోపిక గోదావరి’ లోగో అవకాశం ఇవ్వడం తాను మర్చి పోలేనంటారు వివరెడ్డి. ఉద్యమం ఉధృతం గా ఉన్న టైమ్‌లో ఎన్ శంకర్ ‘జైబోలో తెలంగాణ’ లోగో చేయడం తెలంగాణవాడిగా తనకు సంతృప్తినిచ్చిందంటారాయన.






