విద్యుత్ శాఖలో భద్రత కరువు?
- కార్మికుల బతుకుల్లో కరెంట్ షాక్!
- ఆరేళ్లలో ఉత్తర డిస్కంలో 3 వేల మరణాలు
- రాష్ట్రవ్యాప్తంగా నిరంతర మృత్యుఘోష!
- ఏటా వందలాది ఇండ్లలో అంధకారం
- పరిహారం చెల్లింపులోనూ అలసత్వం
సంగారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యుత్ శాఖలో భద్రత కరువైంది. కార్మికుల బతుకుల్లో కరెంట్ షాక్ తగులుతున్నది. విద్యుత్ పనులు చేస్తూ ఏటా వందలాది మంది కార్మికులు ప్రాణాలు విడుస్తున్నారు. వారి ఇండ్లలో అంధకారం అలుముకుంటోంది. ఆరేళ్లలో ఉత్తర డిస్కంలో 3వేల మరణాలు సంభవించాయి. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా ఇరిగిపల్లిలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ తలారి రంజిత్ కుమార్ విధి నిర్వహణలో ఉండగా కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ కార్మికులే కాకుండా పౌరులు కూడా మృతిచెందుతున్నారు. పశుపక్షాదులు సైతం వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, నిర్మాణ రంగం కారణంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గృహ విద్యుత్ కనెక్షన్లు 1.40 కోట్లు దాటగా, వ్యవసాయ బోర్ల కనెక్షన్లు 30.36 లక్షలకు పైగా ఉన్నాయి.
వినియోగం పెరుగుతున్నా.. దానికి సమానంగా క్షేత్రస్థాయి కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందనడానికి నిత్యం జరుగుతున్న ప్రమాదాలే ఉదాహరణ. సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన అధికారిక గణాంకాల ప్రకారం కేవలం ఉత్తర తెలంగాణ డిస్కమ్ పరిధిలోని 16 జిల్లాల్లోనే గత ఆరేళ్ల కాలంలో విద్యుత్ ఘాతాల వల్ల 3,008 మంది మరణించారు. ఇందులో క్షేత్రస్థాయి లైన్ సిబ్బందితో పాటు సాధారణ రైతులు, పౌరులు కూడా ఉన్నారు.
పరిహారంలో జాప్యం
ఉత్తర డిస్కమ్ పరిధిలో 3,008 మరణాలలో కేవలం 1,197 మంది బాధితుల కుటుంబాలకు మాత్రమే డిస్కమ్‌ల నుంచి పరిహారం మంజూరైనట్లు సమాచారం. మిగిలిన 1,800 పైగా కుటుంబాలు నిబంధనల లొసుగులు, అవగాహన లోపంతో నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. కనెక్షన్ల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతున్నా, దానికి తగ్గట్టుగా రెగ్యులర్ లైన్మెన్లు, హెల్పర్ల నియామకం జరగడం లేదు. ప్రస్తుతం సుమారు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులు క్షేత్రస్థాయిలో విపరీతమైన పని ఒత్తిడి మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఒకే లైన్‌మెన్ 3 నుంచి 5 గ్రామాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో తీవ్ర ఒత్తిడి వల్ల లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) ప్రక్రియలో మానవ తప్పిదాలు జరుగుతున్నాయి.
రక్షణ శూన్యం.. భద్రతపై అలసత్వం
జాతీయ మానవ హక్కుల కమిషన్ గతంలో దక్షిణాది డిస్కమ్ పరిధిలో జరిగిన 69 విద్యుత్ మరణాలపై సుమోటోగా స్పందించింది. లైన్ పనులకు వెళ్లే సిబ్బందికి నాణ్యమైన ఇన్సులేటెడ్ గ్లోవ్స్, అర్త్ రాడ్లు, భద్రతా ప్రమాణాలతో కూడిన సేఫ్టీ బెల్టులు ఇవ్వడం లేదని కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా చోట్ల సరైన శిక్షణ లేని తాత్కాలిక లేదా ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రమాదకరమైన హై-వోల్టేజ్ పనులకు పంపడం వల్లే దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30.36 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
రాష్ట్రంలో క్షేత్రస్థాయి ఆర్టిజన్ల సంఖ్య 19 వేలు. ప్రస్తుత ప్రమాద పరిహారం రూ.8 లక్షలు (రూ.5 లక్షల నుండి పెంపు) అందిస్తున్నారు. ప్రభుత్వ కొత్త ప్రమాద బీమా పథకం రూపొందించి రూ.కోటి (విధి నిర్వహణలో మరణిస్తే) అందిస్తున్నట్లు ఆ శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క ప్రకటించారు. అసలు ప్రాణాలు పోకుండా ఉండేలా ’ముందస్తు భద్రతా చర్యలపై’ డిస్కంలు దృష్టి పెట్టడం లేదు. కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా కాకుండా, ఆటోమేటెడ్ డిజిటల్ ఎల్సీ విధానాన్ని ప్రవేశపెట్టి, నిబంధనలు ఉల్లంఘించే సబ్స్టేషన్ సిబ్బందిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ప్రాణనష్టాలను అడ్డుకోగలం.






