15 June, 2026 | 3:58 AM

చినుకు పడిందా.. చిత్తడే..

15-06-2026 01:16 AM

వర్షం పడిందా.. పొంగిపోర్లే మురుగు నీరు..

చిన్న వర్షానికి వరదలా మురుగు నీరు 

కూకట్‌పల్లి, జూన్ 14 (విజయక్రాంతి): ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని  ఆల్విన్ కాలనీ డివిజన్  తులసి నగర్ 3లో చిన్నపాటి వర్షానికే అక్కడి మ్యాన్ హోల్స్ నుండి మురుగునీరు వరదల కాలనీ రోడ్లను  ముంచెత్తడంతో అక్కడి స్థానిక ప్రజలు మురుగునీటి వాసనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది కలిగిస్తుందని స్థానికులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తులసి నగర్ 3 కాలనీకి ఎత్తులో ఉన్న వాంబే కాలనీ, తులసి నగర్ ఉండడం, అక్కడి నుండి దిగువకు వచ్చే మురుగు నీటి పైప్ లైన్ పైపులు చిన్నవిగా ఉండడం, దిగువ ప్రాంతంలో ఉన్న మ్యాన్ హోల్ పై కప్పు మురుగునీటి ప్రవాహ ప్రెజర్ కు తెరుచుకోవడంతో రోడ్లపై మురుగునీరు వరదల ప్రవహిస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పైప్ లైన్లు పైపులు చిన్నగా ఉండడంతో ఈ సమస్య వస్తుందని డ్రైనేజీ పైప్ లైన్లు పైపులు పెద్దవి వేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం శూన్యమని స్థానికులు వాపోతున్నారు. వర్షం పడిందంటే... వారం,పది రోజులు ఆ రోడ్డు అంతా మురికి కూపంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఐదు, ఆరు సంవత్సరాల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైప్ లైన్ లో పైపులు చిన్నవి ఏర్పాటు చేయడం, అనంతరం కాలనీ విస్తరించి ఎన్నో కాలనీలలో నిర్మాణాలు రావడంతో నివాసాలు ఏర్పరుచుకున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ సమస్య జటిలింగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైపులైన్లు పైపులు పెద్దవి ఏర్పాటు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కాలనీవాసులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కాలనీ వాసులు అధికారులను హెచ్చరిస్తున్నారు.