దీక్ష విరమించిన కవిత, విశారదన్
నిమ్మరసం ఇచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలంటూ నిరవధిక ఆమరణ దీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ వ్యవస్థాపకుడు విశారదన్ మహరాజ్ దీక్ష బుధవారం సాయం త్రం విరమించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇద్దరితో దీక్ష విరమింపజేశారు.
బాధి తులను అక్రమణదారులుగా ముద్రవేసి ఇళ్ల ను కూల్చేసిన ప్రభుత్వం, కవిత- విశారదన్ల పోరాటంతో దిగొచ్చి, వారినే యజమానులు గా గుర్తిస్తూ పట్టాల పంపిణీకి టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమించారు. ఈ సందర్భం గా కవిత మాట్లాడుతూ.. ‘ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వానికి ఎంత ధైర్యం. పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించామని ట్వీట్ చేశారం టే.. యజమానుల ఇళ్లనే కూల్చామని ప్రభు త్వం ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదా న్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత సంచలన ఆరోపణ చేశారు. భూదా న్ భూములు పేదల భూములు, వాటిపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మంత్రులు 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించినా, ప్రభుత్వం ఇచ్చిన టోకెన్లపై తమకు అనుమానాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందో లేదో తెలుసుకోవడానికి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో ’ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ని వేస్తున్నామని, మళ్లీ బాధితులతో మాట్లాడి, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.




