కడియం శ్రీహరి విచారణ పూర్తి
- తీర్పును రిజర్వు చేసిన స్పీకర్
దానం నాగేందర్ విచారణ శనివారానికి వాయిదా
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు విచారణ కొనసాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమక్షంలో గురువారం విచారణ ముగిసింది. ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్.. తీర్పును రిజర్వు చేశారు. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూతురు కావ్యకు వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకుని ప్రచారం చేశారని పిటిషనర్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి తరఫున లాయర్లు స్పీకర్ ముందు వాదనలు వినిపించారు.
కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు. విచారణ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తరఫు అడ్వకేట్ మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, వాటన్నింటిని స్పీకర్‌కు అందజేసినట్లు తెలిపారు. స్పీకర్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.
దానం నాగేందర్ తరఫున వాదించే న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో విచారణ శనివారానికి వాయిదా వేశారని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు రావాలని ఇరువర్గాలకు స్పీకర్ సూచించారు.
అనర్హత పిటిషన్ ఎదుర్కొన్న 10మంది ఎమ్మెల్యేలకు గాను 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గాను కడియం శ్రీహరి విచారణ కూడా ముగిసింది. ఈ కేసులో దానం నాగేందర్ విచారణ పూర్తయితే.. ఫిరాయింపుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.




