షాద్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనానికి రూ.29.70 కోట్ల నిధులు విడుదల
షాద్ నగర్ నియోజకవర్గంలో సాంకేతిక విద్యకు అత్యధిక ప్రాధాన్యత
షాద్ నగర్ ఎమ్మెల్యే ‘వీర్లపల్లి శంకర్‘
షాద్నగర్, మార్చి 5 (విజయక్రాంతి): షాద్ నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ డిప్లొమా స్థాయి సాంకేతిక విద్యను పెద్ద ఎత్తున అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.29.70 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం సాయంత్రం షాద్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం ఉన్నత సాంకేతిక విలువలతో విద్యను అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత కేబినెట్ శాఖ మంత్రుల సహకారంతో లింగారెడ్డి గూడ వద్ద (అలీ సాబ్ గూడ) వద్ద 3 ఎకరాలలో ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 29 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. దాదాపు 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ అత్యున్నత పాఠశాల నిర్మాణం కొందుర్గ్ లో జరుగుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సొంత ప్రయత్నంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కోట్లది రూపాయలతో ఇండోర్ స్టేడియం అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందించాలన్న కృత నిశ్చయంతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో నిరాటకంగా కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారని దీనివల్ల సమాజంలో విద్యకు మంచి ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు.
తాను ఎమ్మెల్యే అయ్యాగా మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి 29 కోట్ల 70 లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం మంచి విషయమని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, సీనియర్ నేత డంగు శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ ఖదీర్, లింగారెడ్డి గూడ ఉపసర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.




