జూన్ 2ను అపాయింటెడ్ డేట్‌గా ప్రకటించాలి
ఎండీకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వినతి
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, రాష్ట్ర ఆవిర్భావం రోజైన జూన్ 2 తేదీన తమ అపాయింటెడ్ డేట్‌గా ప్రకటించాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ అహ్మద్ అలీ నేతృత్వంలోని బృందం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డికి బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
సమ్మె సమయంలో ఆత్మ హత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఆదుకునేందుకు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి నుంచి రూ.300 లను మే జీతంలో కటింగ్ చేయాలని కోరారు. ఆర్టీసీలో మెజారిటీ సంఖ్యలో ఉన్న 17 వేల మంది డ్రైవర్లు, 14 వేల మంది కండక్టర్లకు ఉద్యోగ భద్రత లేదని, విలీనంతో అది సాధ్యమవుతుందన్నారు. డి.గోపాల్, జే.రాఘవులు, నగేశ్, శరణప్ప పాపయ్య, ఏఎస్.రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






