9 May, 2026 | 2:17 AM

రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయం చేయడం తగదు..

09-05-2026 01:02 AM
  1. నాడు వరి ఏస్తే ఊరే అన్నకేసీఆర్..
  2. తడిసిన మొక్కజొన్నలు ధాన్యం కొనుగోలు చేస్తాం..
  3. జగిత్యాల లో తడిసిన మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి..

జగిత్యాల, మే 8( విజయక్రాంతి ) : రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలు చేయడం తగదని, రాష్ట్రంలోని రైతు ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువా రం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి తడిసిన వారి ధాన్యం, మక్కజొన్నలను జగిత్యాల మార్కెట్ యార్డులో శుక్రవా రం ఉదయం మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా పంటలకు మద్ద తు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని మంత్రి ఆరోపించారు.రైతులకు మద్దతు ధర అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం కోరి ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.జగిత్యాల జిల్లాలో గత ఏడాదితో పో లిస్తే పెద్ద ఎత్తున పంట దిగుబడులు వచ్చాయని తెలిపారు.జగిత్యాల మార్కెట్ యార్డు లో 487 మంది రైతుల వద్ద 1151 మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించగా ఈ ఏడాది ఇప్పటికే 697 మంది రైతుల వద్ద 2607 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో పాటు మక్కజొన్నలను కొనుగోలు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని అన్నారు.

రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులు రా జకీయాలు చేయడం తగదని మంత్రి హిత వు పలికారు.గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదని, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రైతులు వరి సాగు చేస్తే ఊరే అని అన్నారని అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న ఒక నాయకుడు ధాన్యం క్వింటాలకి నాలుగు నుంచి ఎనిమిది కిలోల అదనపు తూకం వేస్తే రైస్ మిల్లర్ వద్దకు వెళ్లి మాట్లాడుకోమని అన్నారని మంత్రి అన్నారు.

ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ముందు చూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీకి అభివృద్ధి చేస్తున్నారని ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా రాష్ట్రానికి వివిధ పనుల ద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు.జిల్లాలోని వరి రైతులు, మొక్కజొన్న రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని మార్కెట్ యార్డుల్లో ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొనుగోలు ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ తీరు కారణమని మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ యాప్ ద్వారా 15 రోజులపాటు కొనుగోలులో జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పాత పద్ధతిలోని ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చారని మంత్రి వివరించారు. రవాణా, హమాలి సమస్యలను పరిష్కరించి కొనుగోలు వేగవంతం చేస్తామని తెలిపారు.

మంత్రి వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.