పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లు సమన్వయంతో పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో పాటు మున్సిపల్ ఛైర్మన్లు, అన్ని శాఖల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకూడదని సూచించారు. గృహ హింసకు గురవుతున్న మహిళలకు అండగా ఉండేందుకు సఖి కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో పీహెచ్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి అన్నారు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పేద కార్మికులకు అత్యవసర చికిత్సను అందించడానికి అన్ని ఆసుపత్రులలో సేవలు కల్పించడానికి కృషి చేయాలనీ మెడికల్ అధికారులను ఆదేశించారు. నగర వనాల యోజన కింద పట్టణ పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, రోడ్ల విస్తరణకు సంబంధించి అటవీ శాఖ త్వరగా అనుమతులను అందించాలని అన్నారు.
యువతకు ఉపాధి కల్పించడానికి గాను స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించేలా చూడాలని ఎంపీ అధికారులకు సూచించారు. కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అందేలా చూడాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ, కార్మిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ పారిశ్రామిక, విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, బ్యాంకులు అందించే రుణాలపై అవగాహన కల్పిస్తూ , బలహీన వర్గాలకు , విద్యార్థులకు , స్వయం సహాయ సంఘాలకు , ఇతరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
పరిశ్రమల శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ పరిశ్రమలకు రుణాలను సకాలంలో అర్హులకు అందించాలన్నారు, CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల వివరాలను పక్కాగా సేకరించి వాటి ని వివిధ అభివృద్ధి పనులకు మౌలిక సదుపాయాలు కలిపించడానికి ఉపయోగించాలన్నారు. జిల్లా ఖనిజ నిధులను ప్రధానంగా విద్య, వైద్యం అత్యవసర మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. కోఆపెరటివే సొసైటీలు సకాలంలో ఎన్నికలు నిర్వహించి అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
చెరువులలో గుర్రపు డెక్కను తొలగిస్తూ నీరు కలుషితమయ్యే వ్యర్ధాలు చెరువులలో కలవకుండా చేపలు చనిపోకుండా సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. అవసరమైన వారికీ కొత్త మంచి నీటి కనెక్షన్లు ఇస్తూ ప్రతి ఇంటికి నీరు ఏకరీతిగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. నేషనల్ హైవే అధికారులు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన జరిగేలా చెర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖ అధికారులు మునిసిపల్ అధికారుల సమన్వయంతో ట్రాన్స్ ఫార్మర్లు ఇతర మరమ్మతులు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు 25 % ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. డబల్ బెడ్ రూమ్ కి సంబంధించి స్థానిక ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.






