ఇది ’ప్రయాస’ ప్రాంగణం!?
సమస్యల వలయం వెంకటాపురం బస్టాండ్
వెంకటాపురం (నూగూరు), ఆగస్టు 10 (విజయ క్రాంతి) : ప్రజా రవాణా కేంద్రం అంటే ప్రయాణికులకు భరోసా కల్పించే ప్రదేశం. ఆర్టీసీ ప్రయాణం కోసం బస్టాండుకు వచ్చే ప్రయాణికులకు తాగునీరు, కూర్చునే సౌకర్యం, నీడ, ఫ్యాన్లు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండాలి. అయితే వెంకటాపురం ప్రయాణ ప్రాంగణంలో మాత్రం కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాగునీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో దాహంతో ఉన్న ప్రయాణికులు బయట దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం బస్టాండ్ లో వేచి ఉండే ప్రయాణికులకు ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, గాలి ప్రసరణ లేకపోవడంతో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. పనిచేయని ఫ్యాన్లు, లైట్లను వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆవరణలో నిలుస్తున్న వర్షం నీరు
వర్షాకాలంలో వర్షం పడితే ప్రాంగణంలోని గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు బురదనీటిలో నడవాల్సిన దుస్థితి నెలకొంటోంది. మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అద్దె వస్తున్నా వసతులు శూన్యం!
ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ నిర్మించిన వాణిజ్య గదుల ద్వారా ఏటా అద్దె వసూలు చేస్తున్నప్పటికీ, ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి ఆదాయం వస్తున్నప్పుడు అదే ప్రజలకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణ ప్రాంగణంలో 24 గంటలు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, పనిచేయని ఫ్యాన్లు, లైట్లను వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
పారిశుధ్య నిర్వహణను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కోరుతున్నారు. మురుగునీరు, గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని, ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ఫిర్యాదు సహాయ కేంద్రం ఏర్పాటు చేసి, కంట్రోలర్ను నియమించాలని వారు కోరుతున్నారు.
ఇకనైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంకటాపురం ప్రయాణ ప్రాంగణంలో కనీస మౌలిక వసతులు కల్పించి ప్రయాణికుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






