9 April, 2026 | 2:02 AM

రైతులకు సంఘీభావం పేరిట రాజకీయమా?

09-04-2026 12:00 AM
  1. భూసేకరణపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ‘రాజకీయ యాత్ర’లు
  2. వికారాబాద్‌లో బీఆర్‌ఎస్ దుష్ప్రచారంపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు తగదని ఐటీ, పరిశ్ర మలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవు పలికారు. వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లేందుకే ‘రాజకీయ యాత్ర’లు చేస్తున్నారని మండిపడ్డారు.

పదేళ్ల టీఆర్‌ఎస్ అలియాస్ బీఆర్‌ఎస్ పాలనలో తీవ్ర వెనుకబాటుకు గురైన వికారాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకే మొసలి కన్నీరు కారుస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్’గా మార్చేందుకు తాము అహర్నిశలు కృషి చేస్తుంటే, తట్టుకోలేకే తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు.

పెట్టుబడులు రాకుండా, యువతకు ఉపాధి దక్కకుండా అసత్యాలను వండి వార్చుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూములు అవసరం. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న చందనవెల్లి, సీతారాంపూర్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల్లో కొత్త యూనిట్లకు కేటాయించేందుకు భూములు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్నా... న్యాయపరమైన వివాదాలు, యాక్సెస్ రోడ్డు అందుబాటులో లేదు.

ఇలాంటి తరుణంలోనే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం’ అని వివరించారు. ‘పారిశ్రామికాభివృ ద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలను ఎంపిక చేశాం.

కొడంగల్, కోస్గి, దోమ, పరిగి తదితర ప్రాంతాల కనెక్టివిటీని పెంచేందుకు.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రేడియల్ రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రతిపాదించాం. ‘ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్ రూపురేఖలను మార్చా లన్నదే మా ప్రభుత్వలక్ష్యం. మీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా సాగుతున్న బీఆర్‌ఎస్ కుట్రలో భాగస్వామ్యం కావొద్దు’ అని అన్నారు.