వాసవి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
బాన్సువాడ,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి పాఠశాలలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించారు. పలువురు విద్యార్థులు నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా వాసవి పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత మాట్లాడుతూ... మహిళ కేవలం ఒక అబల కాదని ఆమె ఒక తల్లి, ఒక గురువు, ఒక సోదరి, ఒక నాయకురాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదన్నారు. మహిళలు నేటి ప్రపంచంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని వివరించారు.
మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఒక బాలిక చదువుకుంటే కుటుంబం ఎదుగుతుందని పాఠశాలలో చదువుతున్న ప్రతి బాలిక తనలోని ప్రతిభను వెలికితీసి, భవిష్యత్తులో గొప్ప స్థానాన్ని సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాలకుర్తి విజయ్ కుమార్ డైరెక్టర్లు బెజుగం కల్పన నాగులగామ వందన కందారే అనిత మోటమర్రి సంధ్యారాణి పాలకుర్తి శివాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




