1 September, 2026 | 1:50 AM

బిల్లులు రాక... నిర్మాణ దశలోనే "ఇందిరమ్మ" ఇల్లు

31-08-2026 11:40 PM

8 నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు...పట్టించుకోని వైన

అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం

అప్పులు చెల్లించక ఆందోళన

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లు నిర్మించుకునేందుకు అప్పులు చేసి పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమ్లా నాయక్ తాండకు చెందిన అంగోత్ రోజా గత ఎనిమిది నెలల కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు స్లాబ్ లెవల్ పూర్తి అయినప్పటికీ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మాణానికి సంబంధించిన బిల్లుల కోసం గత ఎనిమిది నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రదక్షిణలు చేసిన స్పందన కరువైందని లబ్ధిదారురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం తో పాటు ప్రజావాణిలో కూడా చాలాసార్లు అధికారులకు వినతి పత్రాలు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.దశలవారీగా నిర్మాణ పనులు పూర్తిచేసినప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు, కూలీలు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం ఆ అప్పులకు వడ్డీలు పెరుగుతున్నా వాటిని తీర్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నామని లబ్ధిదారురాలు వాపోతున్నారు.అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే పరిశీలించి,సకాలంలో నిధులు విడుదల చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.