హామీలు అమలు చేయకపోతే సీఎం ఇంటి ముట్టడి చేస్తాం
బీడీ కార్మికుల హెచ్చరిక
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఎన్నికలకు ముందు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లరెడ్డి మాట్లాడుతూ, బీడీ కార్మికులకు పెన్షన్లు అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి గుర్తులేవా అంటూ ఎద్దేవా చేశారు.బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కోనరావుపేట ఎంపీడీఓ స్నిగ్ధకు వినతిపత్రం సమర్పించారు. బీడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బీడీ కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ, బీడీ కార్మికులు జ్యోతి, రూప, తార, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






