మంత్రి సురేఖ ఫొటో లేదు.. పేరూ లేదు!
- కేసముద్రంలో అధికారిక కార్యక్రమం.. జిల్లా మంత్రికి మరోసారి అవమానం
- ఫ్లెక్సీతో పాటు శిలాఫలకంపై కూడా పేరు తొలగింపు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య చల్లారని చిచ్చు
మహబూబాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఫొటో, పేరు మరోసారి అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు(Flex banners), శిలాఫలకాల(Stone plaques) నుంచి తొలగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సభావేదికలపై మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఫొటో మరోసారి కనిపించలేదు. దీంతో అధికారిక కార్యక్రమంలో జిల్లా మంత్రికి తీవ్ర అవమానం జరిగింది.
కావాలనే జిల్లా మంత్రి సురేఖను పక్కన పెట్టారా? లేక మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారా? బీసీ మహిళా మంత్రి పదవి(Women ministerial position) గండానికి ఇది సంకేతమా? అటు రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు అధికారిక కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య రచ్చ మళ్లీ రచ్చకెక్కాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, శిలాఫలకాలపై మంత్రి కొండా సురేఖ పేరు, ఆమె ఫొటో కనిపించలేదు.
ఇటీవల గూడూరులో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనూ అధికారిక ఫ్లెక్సీలో ఆమె ఫొటోను ముద్రించకపోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఉద్దేశపూర్వకంగానే ఆమెను పక్కన పెడుతున్నారనే ఊహాగానా లు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కేసముద్రంలో సోమవారం మున్సిపాలిటీ భవన నిర్మాణం, మూడు మండలాల నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన, విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, నారాయణపురం గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ నిర్వహించారు.
ఈ క్రమంలో వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళినాయక్, బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్‌రావు ఫొటోలను ఏర్పాటు చేశారు.
అయితే జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫొటో మాత్రం ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. అలాగే శిలాఫలకాల్లో కూడా సదరు మంత్రి పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఇదే జిల్లా గూడూరు మండల కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా మంత్రి సురేఖ ఫొటో ఏర్పాటు చేయలేదు.
పదవీ గండమా?
ఇటీవల మంత్రి సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన నేపథ్యంలో, రాఖీపౌర్ణమి సందర్భంగా మంత్రి సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. దీంతో అంతా సమసిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో, తాజాగా మంత్రి ఫొటో అధికారిక కార్యక్రమంలో తప్పించడంతో మరోసారి చర్చకు తెర లేపినట్లయ్యింది.






