స్మార్ట్ రేషన్ కార్డులతో ఎంతో మేలు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
01-09-2026 12:24 AM
జడ్చర్ల: మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్దిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, బోగస్ కార్డులను అరికట్టి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందించేందుకే ప్రభుత్వం ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని తెలిపారు. క్యూఆర్ కోడ్, డిజిటల్ భద్రతా ప్రమాణాలతో కూడిన మన్నికైన పీవీసీ కార్డుల ద్వారా సరుకుల పంపిణీ మరింత వేగవంతం కావడమే కాకుండా ఇతర ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య పథకాలను సులభంగా పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.






