ఆత్మీయ భరోసా అమలు చేయాల్సిందే
వీబీజీ రాంజీతో పనికి దూరమవుతున్న పేదలు
ఉపాధి పని ప్రదేశాలలో వ్యకాస సర్వే
కారేపల్లి,(విజయక్రాంతి): భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ ఆశ చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భరోసా కల్పించడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం సింగరేణి మండలంలో ఉపాధి పని నిర్వహిస్తున్న ప్రదేశాలలో వ్యకాస సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యకాస నేత కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఉపాధి హామీ జాబ్‌కార్డులు కలిగి భూమిలేని 22లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదికి అరకొరగా అమలు చేశారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రాంజీ తో పేదలు ఉపాధి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ప్రతి సారీ నిధులు తగ్గించుకుంటూ వస్తుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు పరచి, విబిజీరాంజీ బిల్లుగా మార్పు చేసి కేంద్రం 60%నిధులు విడుదల చేసి మిగిలిన 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలని చెప్పటం సరి కాదన్నారు. యూపీఏ-1 ప్రభుత్వం 2005లో చేసిన చట్టాన్ని యధార్థంగా కొనసాగించాలని ఆయన. డిమాండ్ చేశారు. ఎండల వేడి తీవ్రతతో ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారని, పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటో పద్ధతిని ఎత్తివేయాలన్నారు.
పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పని ప్రదేశంలో టెంటు, మంచినీళ్లు మెడికల్ కిట్టు తదితర వసతులు కలిపించాలన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ పని ప్రదేశాల్లో చేపట్టిన సర్వేలో వెలుగులోకి వచ్చిన సమస్యలనీ పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్ష కార్యదర్శులు యనమనగండ్ల రవి, కేసగాని ఉపేందర్నా, నాయకులు పాసిని నాగేశ్వరరావు, చల్లా మల్లమ్మ, షేక్ సైదులు, కరపటి అరుణ, మద్దెల నాగయ్య, అన్నారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






