17 March, 2026 | 5:08 AM

చదువుకోవాలని కాంక్షను..చిదిమేస్తున్న అనారోగ్యం

17-03-2026 02:06 AM
  1. 16 ఏళ్ల వయసులోనే ఎనిమిదేళ్ల బాలుడిలా కనిపిస్తున్న నిరంజన్

కొడుకి చికిత్స కోసం ఆస్తి అమ్మేసి నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు

మెరుగైన వైద్యం, వికలాంగుల పింఛన్ కోసం ప్రభుత్వం దాతల సహాయం కోరుతున్న కుటుంబం...

హనుమకొండ, మార్చి 16 (విజయక్రాంతి): చదువుకోవాల్సిన వయసు లోనే తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమై జీవితంతో పోరాడుతున్న ఓ బాలుడి పరిస్థితి అందరినీ కలచివేస్తోంది. హనుమకొండ జిల్లా పెగడపల్లి డబ్బాలు హనుమాన్ నగర్ కు చెందిన రామగోపాల్ చారి మానస దంపతుల పెద్ద కుమారుడు నిరంజన్ (16) గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు.

వయసు పదహారేళ్లు అయినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా అతను ఎనిమిదేళ్ల బాలుడిలా కనిపిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం వరకు ఇతర పిల్లల మాదిరిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉన్న నిరంజన్ జీవితం ఒక్కసారిగా తారుమారయ్యింది. అనారోగ్యం తీవ్రత పెరగడంతో క్రమంగా నడవలేని స్థితికి చేరి ప్రస్తుతం పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.

శరీరంలో పట్టుకుంటే భరించలేని నొప్పులు ఉండటంతో అతను సాధారణంగా కదలలేని పరిస్థితి నెలకొంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు తమ కొడుకును కాపాడుకోవడానికి చేతిలో ఉన్న డబ్బు, బంగారం, కొంత పొలం కూడా అమ్మేశారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం సరైన చికిత్స అందించేందుకు కావాల్సినంత సాయం అందక ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం వారు సంపాదించే డబ్బులో ఎక్కువ భాగం బాలుడి మందులకే ఖర్చవుతోంది. నిరంజన్ కు చదువు అంటే ఎంతో ఇష్టం, కానీ ఆరోగ్య పరిస్థితి కారణంగా పాఠశాలకు వెళ్లలేకపోతున్నాడు. చదువుకోవాలని కాంక్షతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలని తన కోరికను తెలిపాడు. ఇదిలా ఉండగా నిరంజన్ కు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న 54వ డివిజన్ కు చెందిన బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. బాలుడి చికిత్స కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావాలని కోరారు. తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించి మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చే దాతల సహాయం తమకు ఎంతో అవసరమని వేడుకుంటున్నారు. సహాయం చేయాలను కునే వారు ఫోన్పే నంబర్: 7386141282 ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.