19 May, 2026 | 2:48 AM

గోవుల అక్రమ రవాణాను అడ్డుకోరా?

20-05-2026 12:00 AM

ఎంఐఎంకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం 

వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క ప్రముక్ బాలస్వామి  

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో, ముఖ్యంగా భాగ్యనగర్‌లో గో హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కారణమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముక్ పగడాకుల బాలస్వామి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఆదేశాలకు తలొగ్గిందని సోమవారం ప్రకటనలో విమర్శించారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నడిరోడ్డుపై వచ్చి పోలీసులపైనే దౌర్జన్యం చేస్తున్నప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత హేయమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ సివి ఆనంద్ గోరక్షణలో ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యాధునిక గోషాలలు నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గోవులను విపరీతంగా కోతకు తరలిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ముస్లింల మెప్పుకోసం హిందువుల గొంతు కోస్తారా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు తాకట్టుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. పోలీసులకే సవాల్ సవాల్ చేస్తూ.. భయభ్రాంతులను సృష్టిస్తున్న ఎంఐఎం నేతలను కట్టడి చేయడంలో చేతులు ముడుచు కుంటున్నారని విమర్శించారు. గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న హిందూ సంస్థల నాయకులపై కేసులు పెట్టడం అత్యంత దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ సంస్థల నాయకులను భయపెట్టి గోవుల హంతకులకు మద్దతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు పేరుకు మాత్రమే ఉన్నాయని, ఎక్కడ కూడా ఆవులను పట్టుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం స్పందించి అక్కడక్కడ డంపు చేసిన గోవులను వెంబడే విడుదల చేసి గోషాలకు తరలించాలని బాలస్వామి డిమాండ్ చేశారు.