10 April, 2026 | 1:44 AM

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..

10-04-2026 12:00 AM
  1. మునుగోడు అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్నా..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, ఏప్రిల్ 9 : మునుగోడులోని ప్రభుత్వ పాఠశాలలలో విద్య బలోపేతం చేయడానికి కృషిచేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాననిము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు . గురువారం మండలంలోని పులిపలుపుల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డ్యూటీ నారాయణలతో కలిసి పాల్గొని మాట్లాడారు.

గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వరుసగా రూ.15,000, రూ.10,000, రూ.7,500 ప్రోత్సాహకాలు అందించినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ఆ ప్రోత్సాహకాలను పెంచుతూ, మొదటి స్థానం వారికి రూ.25,000, ద్వితీయ స్థానం వారికి రూ.15,000, తృతీయ స్థానం వారికి రూ.10,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాల్లాంటివని, గ్రామస్థులందరూ కలిసి వాటి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో చాలామంది ప్రభుత్వ బడుల్లోనే చదివారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.తన తల్లి పేరుతో నడుస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం కొనసాగిస్తానన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర ఉందని పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమననపల్లి సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.