10 April, 2026 | 3:47 AM

తిమ్మాపూర్ ఐఓసీఎల్‌లో మాక్ డ్రిల్

10-04-2026 12:00 AM

షాద్నగర్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం,తిమ్మాపూర్లోని ఐఓసిఎల్ (IOCL) సంస్థ ప్రాంగణంలో  గురువారం అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘మాక్ డ్రిల్’ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ నర్సయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు, ఐఓసిఎల్ భద్రతా సిబ్బంది, నాట్కో (NATCO) సంస్థ సెక్యూరిటీ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు ఉద్యోగులు కలిపి సుమారు 150 నుంచి 180 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్హెచ్‌ఓ నర్సయ్య గారు మాట్లాడుతూ, ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు భయపడకుండా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రాణనష్టం జరగకుండా తక్షణమే ఎలా స్పందించాలి, సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలి అనే అంశాలపై సిబ్బందికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ప్రజల మరియు సంస్థల భద్రతే లక్ష్యంగా ఇటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.