10 April, 2026 | 3:47 AM

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఖర్గే ఆరోపణ బాధాకరం

10-04-2026 12:00 AM

చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంత్ రెడ్డి

చేవెళ్ళ ఏప్రిల్ 9(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీని ఆర్‌ఎస్‌ఎస్లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తేల్లి అనంతరెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించిన సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి, సేవా భావంతో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సంస్థను రాజకీయలబ్ది కోసం ఆరోపించడం  తగదన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా, దేశ సమగ్రతకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను నివారించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందని, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతోందని తెలిపారు.

దేశ ప్రజలు నిజానిజాలను బాగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని, ఇలాంటి వ్యాఖ్యలను వారు ఖండిస్తారని అన్నారు. ఇకపై జాతీయ భావజాలాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే భాజపా తరఫున తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అశోక్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గణేశ్ పాల్గొన్నారు.