మీ భూముల్లోంచి ఒక్క గజం పోనివ్వను
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ఫార్మా సిటీ బాధితులకు మల్లన్న కొండంత అండ
హైదరాబాద్, మే 4(విజయక్రాంతి): ఫా ర్మా సిటీ ఏర్పాటు పేరుతో భూములు కో ల్పోయే ప్రమాదంలో ఉన్న రైతులకు ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సోమవారం ఇబ్రహీం పట్నం మండలం కుర్మిద్ద తండాలో గత 50 రోజులకు పైగా 45 డిగ్రీల ఎండలో టెంట్లు వేసుకుని తమ హక్కుల కోసం పోరాడుతున్న బాధితుల వద్దకు ఆయన స్వయంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.
ఫార్మా సిటీ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాట మార్చి రైతులపై బెదిరింపులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పేద రైతుల భూముల్లోంచి ఒక్క గజం కూడా పోకుండా అడ్డుకునే బాధ్యత తనదేనని, భూములు గుంజుకోవాలని చూసే నాయకుల మెడలు వంచుతానని హామీ ఇచ్చారు. అవసరమైతే అడ్డం పడుకుంటానని, అసెంబ్లీలో సైతం కొట్లాడి ఈ పోరాటాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ఉద్యమం హైదరాబాద్‌కు మార్చాలి
స్థానికంగా పల్లెల్లో టెంట్లు వేసుకుని కూర్చుంటే ప్రభుత్వం పట్టించుకోదని, ఈ సమస్య ప్రపంచానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని హైదరాబాద్‌కు తరలించాలని మల్ల న్న పిలుపుని చ్చారు. కార్యాచరణ కోసం ప్రత్యేక కమిటీ ప్రకటించారు. ఈ పోరాటాన్ని తాను స్వ యంగా భుజానికెత్తుకుంటానని తెలిపిన ఆయన, బాధిత నాలుగు గ్రామాల నుంచి సుమారు 10-20 మంది ముఖ్యులు మంగళవారం ఉదయం 9 గంటలకు తనను కలవాలని కోరారు.
వారి కోసం తన ఇతర అపాయింట్‌మెంట్లు అన్నీ రద్దు చేసుకుంటానని, వారితో కలిసి పోరాటం కోసం ఒక ‘యాక్షన్ ప్లాన్’ (కార్యాచరణ), ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ సంద ర్భంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ.. ఆన్‌లైన్ పోర్టల్స్ నుంచి తమ భూ ముల వివరాలు తొలగించారని, రైతుబంధు నిలిపివేశారని వాపోయారు.ధరణి లాంటి ఆన్లైన్ రికార్డుల్లో భూమి లేకపోవడం వల్ల తాము పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నామని, కనీసం యూరియా కూడా కొనుక్కోలేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామని మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాలన్నింటిపై స్పందించిన మల్లన్న, రాజకీయ నాయకుల్లా తాను మాట తప్పే వ్యక్తిని కానని, బాధితులకు జరిగిన నష్టాన్ని ఆపుతామని, హక్కులను కాపాడుతామని తె లిపారు. భవిష్యత్ ఉద్యమ బాధ్యతను తాను తీసుకుంటున్నానని ప్రకటించారు.






