5 May, 2026 | 1:24 AM

బస్తాకు రెండు కిలోల కోత

05-05-2026 12:00 AM
  1. ఒప్పుకుంటేనే దించుకుంటామంటున్న మిల్లర్లు...
  2. కలెక్టర్‌కు మొరపెట్టుకున్న రైతులు 

మంచిర్యాల, మే 4 (విజయక్రాంతి) : జిల్లాలో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా ఏజన్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబోసి కాంటా కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ మండలానికి విజిట్ చేసినా సమీప ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., అది అమలుకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకతప్పడం లేదు. 

బస్తాకు రెండు కిలోల కోత...

సాధరణంగా సివిల్ సప్లయ్ సరఫరా చేసేది 40 కిలోల బస్తా. రైతుల నుంచి బస్తా బరువుపోను 40 కిలోల వరి ధాన్యం తూకం వేయాలి. బస్తా బరువుకు కొంత ఎక్కువగానే రైతే స్వచ్ఛందంగా 41 కిలోలు తూకం వేయడానికి ఒప్పుకుంటున్నాడు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 43 కిలోలు జోకిస్తుండ్రు. ఎందుకంటే మిల్లర్ దింపుకోవడం లేదు, 43 కిలోలు ఇస్తేనే ఓకే అంటున్నాడని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఓ వైపు మబ్బులు వస్తుండటం, మరో వైపు బస్తాకు రెండు నుంచి మూడు కిలోలు ఎక్కువ తూకం వేస్తేనే కాంటా చేస్తామంటుండటంతో రైతులు విలవిలలాడుతున్నాడు. 

కలెక్టర్‌కు మొరపెట్టుకున్న రైతులు 

కలెక్టరేట్ లో సోమ వారం నిర్వహించే ప్రజావాణిలో జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ రైతులు అధికారులకు సమస్యను మొరపెట్టుకున్నారు. 15 రోజులుగా ధాన్యం ఆరి ఉందని, బస్తాకు రెండు కిలోలు తూకం అధికానికి ఒప్పుకుంటేనే కాంటా చేస్తామని ఐకేపీ మహిళలు డిమాండ్ చేస్తున్నారని, గవర్నమెంట్ ఇన్ స్ట్రక్షన్స్ మేరకే 43 కిలోలు జోకుతున్నామని అంటున్నారని వాపోయారు. అధికారులే బస్తాకు ఎన్ని కిలోలు జోకాలో అధికారికంగా ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని గంగిపల్లి గ్రామ రైతులు సుమన్, జనార్ధన్ రెడ్డి, సుధర్శన్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జనగామ చిన్నయ్య, నరెడ్ల తిరుపతి రెడ్డి తదితరులు వేడుకున్నారు. జిల్లా బాస్ తోపాటు సివిల్ సప్లయ్ కలెక్టర్ (అదనపు కలెక్టర్ - రెవెన్యూ)లు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.