సొంత పంథా ఎంచుకున్నా !
- అందుకే.. బీజేపీని వీడాలనుకుంటున్నాను
- కేంద్రమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ
- పార్టీ జాతీయ అధ్యక్షుడు నబీన్‌కు రాజీనామా లేఖ?
న్యూఢిల్లీ, జూన్ ౨: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాను సొంత పం థాను ఎంచుకున్నానని, ఈ కారణంతోనే బీజేపీని వీడాలనుకుటున్నానని కేంద్రమంత్రికి అన్నామలై తెలిపినట్లు జాతీయ మీడి యాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అన్నామలై అంతకుముందే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలోనే తాను పార్టీని వీడాలనుకుంటున్నాని అన్నామలై వారికి తెలిపినట్లు సమాచారం. నితిన్ నబీన్‌కు ఈమేరకు తన రాజీనామా లేఖ సైతం అందించినట్లు తెలిసింది.
మరోవైపు, పార్టీ అధిష్ఠానం అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. జాతీయ స్థాయి లో కీలక పదవితోపాటు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసిందని, అయితే.. ఆ ప్రతిపాదనలన్నింటినీ అన్నామలై సున్నితంగా తిరస్కరించినట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. బీజేపీ పెద్దలు బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ, అన్నామలై పా ర్టీని వీడేందుకే మొగ్గుచూపారని సమాచా రం. తమిళనాడులోని మరే ఇతర పార్టీలో నూ చేరే ఉద్దేశం కూడా తనకు లేదని, కొద్దిరోజుల్లోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని అన్నామలై స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్నామలై సొంతం గా రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
ఎందుకు పార్టీని వీడాల్సి వస్తోంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని అన్నామలై వ్యతిరేకించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూ డు భాషలను తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదేమైనా, తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారనేది అగ్రనాయకత్వం గుర్తించింది. ఏఐఏడీఎంకే నేతలపై అన్నామలై చేసిన విమర్శలు ఇరు పార్టీల కూటమి విడిపోవడానికి కారణమయ్యాయి.
2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధిష్టానం మళ్లీ ఏఐఏడీఎంకేతో జతకట్టింది. ఆ పార్టీ ఒత్తిడి వల్లే అన్నామలైని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి నైనార్ నాగేంద్రన్‌ను నియమించింది. కూటమి కోసం తనను పక్కన పెట్టడాన్ని అన్నామలై జీర్ణించుకోలేకపోయారు. చివరికి ఏఐఏడీఎంకే కూటమితో వెళ్లిన బీజేపీ కేవలం 3 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ వరుస పరిణామాలే ఆయన్ను బీజేపీ నుంచి బయటకు వచ్చేలా చేశాయి.






