చీలిక దిశగా టీఎంసీ
- పార్టీ అధినేత్రి మమతకు రెబల్స్ బెడద
- శాసనసభ పక్ష సమావేశానికి ౬౧ మంది ఎమ్మెల్యేలు డుమ్మా
- తెరపైకి ‘అస్లీ తృణమూల్’
- కొత్త పార్టీ దిశగా రెబల్స్ అడుగులు
కోల్‌కతా, జూన్ ౨: పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారింది. పార్టీ త్వరలో రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో చేలరేగిన అంతర్గత విభేదాలే కారణం. పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి ముఖ్య అనుచరులుగా పేరున్న నేతలు, ఎమ్మెల్యేలు తిరుగబా టు బావుటా ఎగురవేయడం ఆమె తలనొప్పిగా మారింది.
తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సాందీపన్ సాహా, రీతబ్రత బెనర్జీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆమె వేటు వేశారు. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, కొన్నివా రాల నుంచి టీఎంసీ రెబల్ నేతలు, సుమా రు ౫౦ మంది ఎమ్మెల్యేలు కోల్‌కతాలోని హోటల్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో ‘అస్లీ తృణమూల్’ పేరిట కొత్త పార్టీ ప్రస్తావన కూడా వచ్చినట్లు స్థానిక మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి.
సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా
కోల్‌కతాలోని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో మంగళవారం ఆమె పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించగా 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. వీరిలో సుమారు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు అస్లీ తృణమూల్ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్నది.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా టీఎంసీ నేతలకు చుక్కలు చూపిస్తున్నది. ముఖ్యమంత్రి సు వేందు అధికారి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున టీఎంసీ గూండాలను అరెస్ట్ చేయించారు. ఎంతోమంది టీఎంసీ నేతల నివాసాల్లో ఐటీ, ఈడీ దాడులు చే యించారు. తాజాగా టీఎంసీ అధినేత్రి మ మతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై భౌతిక దాడులూ జరిగాయి.
దీక్షకు అనుమతివ్వకపోయినా చేస్తా: మమతా బెనర్జీ
బీజేపీ ప్రభుత్వ దూకుడు చర్యలకు నిరసనగా టీఎంసీ అధినేత్రి మమత నిరసన దీక్ష నిర్వహించాలని సంకల్పించా రు. అయితే, ఆ దీక్షకు అనుమతిచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో మమత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీక్ష కు అనుమతి ఇవ్వకున్నా ధర్నా నిర్వహిస్తానని, కావాలంటే తనను అరెస్టు చేసు కోవాలని పోలీసులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదా పు 12 మంది టీఎంసీ కార్యకర్తలు హత్య కు గురయ్యారని, వేలాది మంది పార్టీ కార్యకర్తలు అరెస్టయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తానని, ఒకవేళ కోల్‌కతా లో దీక్ష కుదరకపోతే ఢిల్లీకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తానని తేల్చిచెప్పారు.






