మూసీలో పడ్డ మహిళను కాపాడిన హైడ్రా
16 నిమిషాల్లో రంగంలోకి దిగిన హైడ్రా, డీఆర్‌ఎఫ్
ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి): అంబర్‌పేటలోని గోల్నాక సమీపంలో మూసీ లో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను హైడ్రా కాపాడింది. శనివారం ఉదయం 10.51 గంటలకు హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం రాగా కేవలం 10 నిమిషాల్లోనే హైడ్రా బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అంబర్‌పేట్ సమీపంలోని గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇందిర (49) శుక్రవారం రాత్రి మూసీలో పడిపోయిం ది. రాత్రంతా ఆమె మూసీలోనే భయం భయంగా గడిపింది.
కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత స్థానికులు గుర్తించారు. బయటకు తీయడానికి అవకాశం లేకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. డీఆర్‌ఎఫ్ టీమ్ 16 అంబర్‌పేట్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
హైడ్రా సహాయక చర్యలు జరుగుతుండగానే ఫైర్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. పెద్ద నిచ్చెన సహాయంతో డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు కిందకు దిగి మూసీ లో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు అప్పగించారు. పొరపాటున జారి పడిపోయినట్టు ఆమె చెప్పారు. భర్త లేడని, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నా అని ఆమె చెప్పారు. మహిళను హైడ్రా సిబ్బంది రక్షించిన తీరును స్థానికులు అభినందించారు.






