చెపాక్‌లో ఆరంభ మ్యాచ్
- డిసెంబర్ 12 నుంచి బీబీఎల్
- బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల
మెల్‌బోర్న్, జూలై 14 : ఆస్ట్రేలియా డొమెస్టిక్ టీ20 లీగ్ బిగ్‌బాష్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే తొలిసారి విదేశాల్లో మ్యాచ్ నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026--2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ ఆరంభ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
ఇటీవల ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని గత వారం అధికారికంగా ప్రకటించారు. తాజాగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్ భారత్‌లో జరిగిన అనంతరం ప్రధాన బీబీఎల్ సీజన్ మొత్తం డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలోనే ప్రారంభమవుతుంది.
ఈసారి కూడా లీగ్ దశలో మొత్తం 40 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. జనవరి 17న లీగ్ స్టేజ్ పూర్తి కానుండగా.. జనవరి 19న తొలి క్వాలిఫయర్, 20న నాకౌట్, 23న ఛాలెంజర్, 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. ఈ సీజన్లో ‘డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్’ అనే కొత్త నిబంధనను అమలు చేయనున్నారు.ఈ రూల్ ప్రకారం జట్లు ఒక ఆటగాడిని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే, మరొకరిని కేవలం ఫీల్డింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.






