అసిస్టెంట్ కోచ్ డస్కాటే రాజీనామా?
ముంబై, జూలై 14 : భారత క్రికెట్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నా యి. వరుసగా రెండు వైట్‌వాష్ పరాభవాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్ బృందంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సహాయక కోచ్‌గా ఉన్న ర్యాన్ టెన్ డస్కాటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆమోదం తెలిపితే, ఇంగ్లండ్‌తో మూడో వన్డే అనంతరం డస్కాటే భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.
డస్కాటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్‌లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ అయిన డస్కాటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఆ ఒప్పందం ఈ నెలతోనే ముగిసిపోనుంది. దీంతో ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.డస్కాటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో హెడ్ కోచ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అతని రాజీనామాను గంభీర్ అంగీకరిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.






