4 July, 2026 | 3:29 AM

రాష్ట్ర చరిత్రలోనే అరుదైన ఘనత

04-07-2026 01:34 AM

రాష్ట్ర చరిత్రలోనే అరుదైన ఘనత..

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

సత్తుపల్లి. జులై 3 (విజయక్రాంతి): ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సుమారు 15,000 మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సత్తుపల్లి పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై విశేష చైతన్యం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే  మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్  హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జేవీఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా మారింది. విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో జేవీఆర్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అనంతరం జేవీఆర్ కాలేజ్ నుండి పాత సెంటర్ మీదుగా భారీ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ మద్దతును తెలియజేశారు. ర్యాలీలో జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే  డాక్టర్ దయానంద్ ర్యాలీలో పాల్గొని వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్  మాట్లాడుతూ, ఇంత భారీ స్థాయిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. నేను ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలతో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్  మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడమూ అంతే ముఖ్యమని అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గం విద్య, అభివృద్ధి, సామాజిక చైతన్యంలో ముందంజలో ఉందని, ఈ భారీ వనమహోత్సవ ర్యాలీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక గుర్తింపును పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, డిఎఫ్ఓ ఖమ్మం జిల్లా డిసిసి. అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  కి నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.