6 March, 2026 | 10:31 AM

ప్రజాపాలన సాగేదిలా!

06-03-2026 02:09 AM

మహబూబాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక జిల్లాలో 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 99 రోజులపాటు చేపట్టాల్సిన అంశాలను సమగ్రంగా వివరించడంతో పాటు ఎప్పటికప్పుడు కార్యక్రమాల ను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను దారి చేసింది.

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో పాటు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రజా పాలన కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అ య్యేలా కార్యాచరణ రూపొందించారు. మా ర్చి 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రజా పాలనలో నిర్వహించే కార్యక్ర మాల వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరి ష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్న ట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సం క్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు సురక్షితంగా చేరుకోండి ఆరైవ్ అలైవ్ కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు సంక్షేమం అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మరియు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించి, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ డ్రగ్స్ నో కార్యక్రమం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల రూపంలో అమలు చేస్తారు. 4 నుండి మే 9 వరకు రైతులు, వ్యవసాయం అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులు విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహిస్తారు. మే 18 నుండి మే 23 వరకు యువత, క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు.

మే 25 నుండి మే 30 వరకు మహిళలు అంశంపై మహిళా సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.ఈ 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు దశల్లో అమలు చేయబడుతుందని తెలిపారు. మార్చి 6న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కార్యాచరణపై మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు వెల్లడించారు.

సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా మార్చి 6 నుండి 16 వరకు నిర్వహించనున్న పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రహదారుల వెంట పిచ్చి మొక్కల తొలగింపు, చెత్త నిర్మూలన, తడి, పొడి చెత్త వేరు సేకరణను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.