6 March, 2026 | 7:57 AM

పాలమాకు ఒర్రె నుంచి ఆలయానికి వనదేవత

06-03-2026 02:07 AM

వైభవంగా ఎదుర్కోలు

శివ సత్తుల పూనకాలు

ఆకట్టుకున్న గిరిజన విన్యాసాలు

భక్త జనంతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం 

మంగపేట, మార్చి 5 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో మహా జాతర అశేష భక్త జన సందోహం నడుమ వైభవంగా కొనసాగుతుంది. ఐదు రోజులు పాటు జరిగే ఈ మహా జాతరలో మూడవ రోజైన గురువారం పాలమాకు ఒర్రె నుండి కంకవనం ( వనదేవత ) ఆలయానికి రాక, ఎదుర్కొలు, నాగులమ్మ తల్లి - పగిడిద్ద రాజుల కళ్యాణం, అగ్ని గుండంలో నడవడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

గురువారం మధ్యాహ్నం పాలమాకు ఒర్రె వద్ద వన దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్, ఇతర పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాలమాకు ఒర్రె నుండి అమ్మ వారిని ( వన దేవతను ) భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్ళ మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. వన దేవతను ఆలయానికి తీసుకు వచ్చే క్రమంలో రాజుపేట గ్రామంలో శ్రీ నాగులమ్మ అమ్మవారికి, వనదేవతకు ఎదుర్కోలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

నాగులమ్మ ఆలయ, జాతర ప్రాంగణంలోని  రావి చెట్టు, మారేడు చెట్టు, నేరేడు చెట్టు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, నల్ల సండ్రి చెట్టు, ఉత్తరేణి చెట్టు, తెల్ల జిల్లేడు చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదుర్కోలు సందర్భంగా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో చేసిన దింసా నృత్యాలు, గుస్సాడి నృత్యాలు , పలు విన్యాసాలు ఆక ట్టుకున్నాయి. శ్రీ నాగులమ్మ అమ్మవారు, వనదేవతకు ఎదుర్కోలు సందర్భంగా శివ సత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆలయ, జాతర ప్రాంగణం జాతరకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్దరాజులకు ధనుర్లగ్నంలో కల్యాణ మహోత్సవం నిర్వహించారు.

నాగులమ్మ జాతర, కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా మంగపేట ఎస్త్స్ర టి. వి. ఆర్. సూరి ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, మడకం రమేష్, పూజారులు కొమరం ధనలక్ష్మి, బాడిశ నవీన్, సోడి శీను, ఈసం సమ్మక్క, కట్టం సమ్మక్క, కుర్సం వీరమ్మ, కుర్సం పుల్లయ్య, లక్ష్మి, సోడి శివ నాగేశ్వరి, మడకం సుప్రజ, కుర్సం సౌందర్య, మడకం సంధ్య, చోళం కళ్యాణి, కొర్స సవిత, మడకం నాగమణి, చౌలం శాంత, తదితరులు పాల్గొన్నారు.