1 June, 2026 | 3:29 AM

గజ్వేల్ కు 2,500 ఇళ్లు..

01-06-2026 02:21 AM
  1. మంజూరు చేశామన్న మంత్రి వివేక్ 
  2. రూ. 11.09 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ 
  3. గడువు ముగిసిన చెక్కులతో లబ్దిదారుల నిరాశ 
  4. తులం బంగారం కోసం మహిళల గుసగుసలు

గజ్వేల్, మే 31: గజ్వేల్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, త్వరలో రెండో విడతలో 2500 ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేయనున్నట్లు కార్మిక, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీ కృత కార్యాలయ సముదాయంలో ఆదివా రం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మం త్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 1,053 కళ్యాణ లక్ష్మి, 56 షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.11.09 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.

అలాగే వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 90 మంది గీతా కార్మికులకు  కాటమయ్య కిట్లను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గజ్వేల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు.

యువతకు ఉపాధి అవకాశాల కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ, జర్మన్ భాష బోధన చేపడుతున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గడువు ముగిసిన చెక్కులతో నిరాశ చెందిన లబ్ధిదారులు   

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతుంది అన్న సమాచారం అధికారులు ఇవ్వడంతో  ఎంతో ఆశతో వచ్చిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. గజ్వేల్ ఐఓసీలో 1200 మందికి పైగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు.

ఐఓసీ బ్లాక్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు  ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కూడా హాజరు కావడంతో హాల్  నిండిపోయి సగానికి పైగా  లబ్ధిదారులు నాయకులు బయటే ఉండాల్సి వచ్చింది. వేసవి కావడంతో బయట ఉన్న వారితోపాటు సమావేశ మందిరం లోపల ఉన్న వారు కూడా ఉక్కపోతతో ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఇంత కష్టపడి కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన చెక్కులలో కొన్ని తేదీ గడువు ముగియడంతో వారిని అధికారులు మళ్లీ వచ్చి తీసుకోవాలని చెప్పారు.

వారితోపాటు చాలామందికి మరో రెండు మూడు రోజుల్లో చెక్కులు అందజేస్తామని చెప్పడంతో వచ్చిన లబ్ధిదారులు నిరాశతో అధికారులను తిట్టుకుంటూ వెళ్లిపోయారు. చెక్కులు వచ్చిన లబ్ధిదారుల సైతం తులం బంగారం ఎప్పుడు ఇస్తారో అనుకుంటూ గుసగుసలు పెట్టుకోవడం కనిపించింది. కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులు హాజరయ్యే లబ్ధిదారులు నాయకులకు తగ్గట్టుగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.