28 June, 2026 | 2:51 AM

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

28-06-2026 01:36 AM

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ

తిరుమల, జూన్ 27: వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో భక్తులు రద్దీ పెరిగింది. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో దర్శనం క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కౌంటర్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మధ్యాహ్నం జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శనివారం ఉదయం 10 గంటలకే అందజేశారు.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటలు పడుతుంది. భారీ ఎత్తున భక్తులు వస్తుండడంతో టీటీడీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అల్పాహారం, నీరు, క్యూలైన్ల  వద్ద భద్రత సౌకర్యాలను పెద్ద ఎత్తున చేపట్టింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టింది. శుక్రవారం 81,340 మంది భక్తులు దర్శనం చేసుకోగా, హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.