28 June, 2026 | 2:45 AM

2005 నాటి కరెన్సీ చెల్లుతుంది!

28-06-2026 01:35 AM
  1. వదంతులు నమ్మొద్దు
  2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పష్టీకరణ

ముంబై, జూన్ 27: ఈ ఏడాది జూన్ 30 తరువాత 2005కు ముందు ముద్రించిన రూ. 10, 20, 50, 100 కరెన్సీ నోట్లు పనిచేయవని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై శనివారం బ్యాంకు స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొంది. నోట్లు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని వినియోగదారులు ఆందోళన చెందొద్దని పేర్కొంది.

అనుమానాల నివృత్తి కోసం బ్యాంకు వెబ్‌సైట్‌లను కూడా సంప్రదించవచ్చని తెలిపింది. కాగా పాతనోట్లను రద్దు చేస్తున్నట్లు బీవోఎం ఆదేశాలు జారీ చేసిందని, ఇతర బ్యాంకులు కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉందని వీడియోలో పేర్కొన్నారు. బ్యాంకు వివరణతో ఈ వీడియోలోని సమాచారం ఫేక్ అని తెలిసింది. కాగా ఆర్బీఐ 2005కు ముద్రించిన మహాత్మాగాంధీ సీరియస్ నోట్ల చలామణి గణనీయంగా తగ్గిందని, అవసరం అయితే వాటిని మార్చుకోవచ్చని మాత్రమే పేర్కొంది.

నోట్లు మాత్రం చెలమణిలోనే ఉంటాయని తెలిపింది. నకిలీలను అరికట్టడానికి కొత్తనోట్లను పాతనోట్ల స్థానంలో మెరుగైన భద్రత, ఫీచర్లతో తీసుకొస్తున్నామని తెలిపింది. పాతనోట్లను నిలిపివేసే ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించలేదు. దీనికి విరుద్ధంగా సోషల్ మీడియాలో ఫేక్ వీడియోకాస్త వైరల్‌గా మారి ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉండడంతో బీవోఎం వివరణ ఇచ్చింది.