ఇల్లు అప్పగింతలో ఆలస్యమైతే పరిహారం కోరొచ్చు: సుప్రీం
ఎన్‌సీడీఆర్‌సీ ఉత్తర్వులను పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ, జూన్ 27: ఫ్లాట్ కొనుగోలు చేసిన తరువాత సంబంధిత సంస్థలు ఆలస్యం చేస్తే వాటికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2016లో నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్‌రీడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఉత్తర్వులను పక్కన పెట్టింది. 2003లో ఓ వ్యక్తి ఢిల్లీలో ఓ సొసైటీలో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అతడికి ఫ్లాట్ అప్పగింత ఆలస్యం కావడంతో అతను సుప్రీం మెట్లెక్కాడు. శనివారం ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
రియల్ ఎస్టేట్ సంస్థల వైఫల్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే హక్కు ఉండదని భావించడం సరికాదని జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు. అభ్యంతరం లేకుండానే ఫ్లాట్ తీసుకున్నారని, సదరు వ్యక్తి వినియోగదారుడు కాదన్న విషయాన్ని తప్పుబట్టారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలో మధ్యవర్తిత్వ నిబంధన ఉన్నంత మాత్రాన వినియోగదారుల ఫోరంలో అప్పీలుదారు దాఖలు చేసిన ఫిర్యాదును తిరస్కరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిర్యాదు దాఖలు చేయడానికి ముందే ఇంటిని స్వాధీనం చేసుకున్నారనే కారణంతో పిటిషనర్ ‘వినియోగదారు’ హోదాను కోల్పోయారని భావించకూడదని జాతీయ కమిషన్‌కు సూచించింది. వస్తువులలో లోపం, సేవలలో లోపం గురించి ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు ‘వినియోగదారుల రక్షణ చట్టం వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వినియోగదారులకు వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది.






