14 March, 2026 | 2:54 AM

గ్రామస్తులపై తేనెటీగల దాడి

14-03-2026 12:41 AM
  1. పలువురికి తీవ్ర గాయాలు

వెంకటాపురం గ్రామంలో ఘటన

సదాశివపేట, మార్చి 13 :తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో పలువురికి తీవ్ర గా యాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో తేనెటీగలు ఒక్కసారిగా గ్రామంలోకి దూసుకువచ్చి రోడ్డుపై వెళుతున్న గ్రామస్తులపై దాడి చేశాయి. ఎటు చూసినా తేనెటీగల గుంపులు గ్రామంలో తిరుగుతుండటంతో ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండ్లలోకి పరుగులు పెట్టారు.

గ్రామంలో ఒక్కసారిగా తేనెటీగల దాడి ప్రారంభమవడంతో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ సాయంతో సమీప  ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒకే అంబులెన్స్ సరిపోకపోవడంతో కొందరు స్వయంగా వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.తేనెటీగల దాడి వల్ల గాయపడిన వారికి తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొందరికి అలర్జీ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఒకేసారి ఎక్కువసార్లు తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలో విష ప్రభావం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, వాంతులు, చర్మంపై తీవ్రమైన వాపు వంటి సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారికి తేనెటీగల కాటు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 

కొందరికి తీవ్ర అలర్జీ రియాక్షన్ (అనాఫైలాక్సిస్) వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో వెంకటాపురం గ్రామం లో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇంకా తేనెటీగల గుంపులు తిరుగుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. తేనెటీగల గూళ్లను గుర్తించి తొలగించాలని, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.