4 July, 2026 | 2:00 AM

ఆయన కవిత రసాయనం!

04-07-2026 12:00 AM

మసన చెన్నప్ప :

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను తెలుగు శాఖ అధ్యాపకుడిని. నాకు ఇతర శాఖల అధ్యాపకులతోనూ మంచి పరిచయం ఉంది. నేను ఒక పదేళ్ల కాలం ‘యూనివర్సిటీ టీచర్స్ అసోసి యేషన్’ (ఔటా)లో ఆయా హోదాల్లో పని చేసి, చివరికి ఔటా అధ్యక్షుడిని అయ్యాను. అందువల్ల నాకు విశ్వవిద్యాలయంలోని అన్ని శాఖల ఆచార్యులతో అనుబంధం ఏర్పడింది. అయితే, ముఖ్యంగా నాకు సైన్స్ డిపార్ట్‌మెంట్‌తో గల అనుబంధాన్ని చెప్పుకోవాలి.

ఆచార్య కడారు వీరారెడ్డి గారు కవిగా నన్ను అత్యంతం అభిమానించే వ్యక్తి. క్యాంపస్‌లో ఎప్పుడు కలిసినా నాలుగు నిమిషాలు మాట్లాడకుండా ఉండేవారు కాదు. నేను నా రచనలిస్తే వాటిని ఆమూలాగ్రం చదివి మంచి విశ్లేషణ చేసేవారు. అప్పటికీ కవిత్వం రాయకపోయినా ఆయ నది నిండైన కవితా హృదయం!

ఆచార్య వీరారెడ్డితో వట్టి పరిచయం కాక, స్నేహం ఏర్పడటానికి మరొక కారణం కూడా ఉంది. నా కూతురు శ్రావణి వారికి పీజీలో ప్రత్యక్ష విద్యార్థి. క్లాసులో మా అమ్మాయి చరుకైనదని ఒకరిద్దరాచార్యులు చెప్పేవారు. ఆ ఇద్దరిలో ప్రొఫెసర్ ఎం.ఆనం దరావు గారున్నారు. వారు దూరవిద్యా కేంద్రం సంచాలకులుగా పనిచేశారు.

ఎప్పు డు కలిసినా మా శ్రావణి గురించి చెప్పేవారు. అయితే రసాయన శాస్త్రాచా ర్యులైన వీరారెడ్డి కలిసినప్పుడల్లా కవిత్వం గురించే మాట్లాడేవారు. క్యాంపస్‌లో సైన్స్ కళాశాల ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన ఆచార్య వీరారెడ్డి నాకు విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణకు మారుపేరుగా, విజ్ఞాన శాస్త్రానికి ప్రతినిధిగా కనిపించేవారు!

ఆచార్య వీరారెడ్డి ఉస్మానియా విశ్వవి ద్యాలయం రసాయన శాఖలో 35 సంవ త్సరాలు పనిచేసి 2011లో పదవీ విరమణ చేశారు. వారు తమ ఉద్యోగ జీవితంలో ఎన్నో గౌరవనీయమైన పదవులు అలంక రించారు. ‘యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్స్ ఆఫీస్’ ప్రథమ సంచాలకులుగా (1999- 2004) పనిచేశారు. రసాయన శాస్త్ర విభాగం అధ్యక్షులుగా (2009-2011) ఉన్నారు.

‘యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్’ ప్రిన్సిపాల్‌గా (2005-2009), సైన్స్ ఫ్యాకల్టీ డీన్‌గా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా, అకడమిక్ సెనేట్ సభ్యులుగా వివిధ హోదాలలో పనిచేశారు. అన్నిం టికంటే ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమంటే ఉద్యోగ విరమణానంతరం వారు ‘శాతవాహన విశ్వవిద్యాలయం (కరీంనగర్) ఉపకులపతిగా (2012-2015) పనిచేశారు. కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జ్ ఉపకులపతిగా తమ సేవలందిం చారు.

వారు ఉపకులపతిగా ఉన్నప్పుడే శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతన భవనాల నిర్మాణం జరిగింది. ఆచార్యులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేసిన సేవలకు గాను 2007లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వీరారెడ్డికి ‘బెస్ట్ టీచర్ అవార్డు’ ఇచ్చి గౌరవించింది. డా.జైశెట్టి రమణయ్య ఫౌండేషన్ వారి నుంచి వీరారెడ్డి 2012లో ‘విద్యారత్నం అవార్డు’ స్వీకరించారు. ఆంగ్లం లో, కెమిస్ట్రీలో వారు ఆరు గ్రంథాలు రచిం చారు. 16 అంతర్జాతీయ, 5 జాతీయ పరిశో ధన పత్రాలను సమర్పించారు.

తమ 60 ఏళ్ల జీవితకాలంలో కవిత్వం పట్ల ప్రేమ చూపడం, కవుల పట్ల అభిమానం కలిగి ఉండడం తప్ప ఎన్నడూ కలం పట్టి, కాగితం మీద పెట్టి కవిత్వం రాయని వీరారెడ్డి ఉద్యోగ విరమణానం తరం కవితావీరునిగా ప్రసిద్ధికెక్కారు. ఒక్క కవిత్వమే కాక, కథలు, వ్యాసాలు రాసి పూర్తిగా తెలుగులో ఒక సుప్రసిద్ధ రచయి తగా పేరుగాంచారు. మరొక చిత్రమైన విషయం ఏమంటే దీర్ఘ కవితా రచనలు చేసిన వారిలో నేడు ప్రముఖ స్థానాన్ని అలంకరించారు.

భాస్వరాలు (2014), కాలం అడుగులు (2014), అక్షరాప్సరసలు (2015), తరంగాల అంతరంగాలు (2015), అందమా నిను వర్ణింపతరమా! (2016), నిత్యయవ్వని (2016), మేఘాల తీరాన (2017), విశ్వనయన (2017), పల్లెకు పోదాం మళ్లీ (2018), భార్యాభర్తల బంధం- ఇరిగిపోని గంధం (2019), కడారు మనో గీతికలు (2019), పాఠకులు కావలెను (2020), మనసు తొడుక్కున్న మనిషి (2021), ఝంఝామారుతం (2022) మొదలైన కవితా రచనలతోపాటు ‘తరం మారినా’ (2018) అనే కథాసంపుటిని, ‘లోకాలోకనం’ (2025) అనే వ్యాస సంపుటిని తెలుగు సాహితీ లోకానికి అందించారు.

వీరి రచనలపై పరిశోధన గ్రంథాలా అన్నట్లు రచనలు చేసిన వారిలో దాస్య సేనాధిపతి, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. వీరి కవితలు, వ్యాసాలు విరివిగా నేటి నిజం, సాహితీ కిరణం, ఆంధ్ర ప్రభ వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భాస్వరాలు 2015లో ‘భాస్వర్’ పేరుతోనూ, కాలం అడుగులు ‘కాల్ కే కదం’ పేరుతోనూ హిందీలోకి అనువాదమయ్యాయి.

ఆలస్యంగా కలం పట్టిన వీరారెడ్డిలో ముఖ్యంగా 1. కవిత్వాన్ని చదవడం, 2. కవి త్వం రాయడం, 3. కవిత్వమై జీవించడం అనే అంశాలున్నట్లు కొండ్రెడ్డి చెప్పి మాట లు సత్యపూర్ణమైనవి.

‘తెరవెనుక ఏనైనా  తెరమీద ఆనేనే,  ముసుగు మనిషి కాను  ముక్కుసూటి మనిషిని’ అని చెప్పుకొన్న వీరారెడ్డి కవిత్వం లో ఎలాంటి దాపరికాలు, దాగుడుమూతలు లేవు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అక్షరాన్ని ప్రేమించి, గురువులనాశ్రయించి, చదువులో రాణించి, చిన్న వయస్సులోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం మెట్లెక్కిన వీరారెడ్డి పెద్ద వయస్సులో కవిగా నిలబడడం అదృష్టం కాదు, అకుంఠిత పురుష ప్రయత్నానికి ధ్వజస్తంభం!

విశ్రాంత జీవితం గడుపుతున్న డా. వీరారెడ్డిని కవితా రచనలో విశ్రాంతి లేకుండా చేసిన ప్రథమశ్రోత, వారి శ్రీమతి డాక్టర్ వసంత గారే.

అచిరకాలంలోనే ఎన్నో రచనలు 

చేసిన వీరారెడ్డిలో తాను గొప్ప 

కవినన్న అహంకారం లేదు.

‘అరవై దాటినా

అక్షరాల 

కూర్పులో అంబాడుతున్నవాణ్ని

కవితావేశంతో

ఉక్కిరిబిక్కిరవుతున్నవాణ్ని

అసలు సిసలైన 

కరీంనగర్ వాణ్ని’ అంటారు మరి!

వీరారెడ్డి జనం భాషనే కవిత్వానికి జీవ భాషగా భావించారు. ఆయన మాటలతో బొమ్మలు గీయగలిగిన ప్రజ్ఞావాలి. మానవ త్వాన్ని ప్రేమించే వీరారెడ్డికి తెలుగులో మానవతామూర్తిగా చిరకాలం వెలుగొందిన సి.నారాయణరెడ్డి అభిమాన కవి. సరళ సుబోధకమైన శైలిలో కవితారచన చేసే వీరారెడ్డిలో పాండిత్యం కంటే ప్రతిభ వెయ్యి రెట్లు భాసిస్తుంది.

‘పాండిత్యానికి 

ప్రయోజనం పండితులమెప్పు

కవిత్వానికి ప్రయోజనం లోకానికి చైత న్యాన్ని అందించడం’ అంటూ నిత్యం కవితా వసంతునిగా కనిపించే వీరారెడ్డి దగ్గరి కవి మిత్రులలో నేనుండడం, ఒక మరిచిపోలేని అనుభవం!

 వ్యాసకర్త సెల్: 9885654381