4 July, 2026 | 2:49 AM

వివక్షను ఓడించి ఆటలో గెలిచి!

04-07-2026 12:00 AM

పుల్లెంల గణేష్ :

నేడు పాల్వంకర్ బాలు వర్ధంతి :

* పాల్వంకర్ బాలు క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన సామాజిక సమానత్వం కోసం కూడా కృషి చేశారు. దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన జీవితం ఎంతో మంది అణగారినవర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే క్రికెట్ క్రీడలో భారత ఖ్యాతి ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప క్రీడాకారుడు పాల్వంకర్ బాలు. 1876 మార్చి 19న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని ధార్వాడ్ ప్రాంతంలో ఆయన జ న్మించారు. ఆయన పూర్తి పేరు పాల్వంకర్ బాలు.

ఆయన కుటుంబం దళిత వర్గానికి చెందింది. ఆ కాలంలో భారతీయ సమాజంలో కుల వివక్ష తీవ్రంగా ఉండేది. తక్కువ కులానికి చెందిన వ్యక్తులు అనేక సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వివక్షలను ఎదుర్కొనేవారు. అలాంటి పరిస్థితుల్లో జన్మించిన బాలు చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

చిన్న వయస్సులోనే పాల్వంకర్ కుటుంబం పూణేకు వలస వెళ్లింది. జీవనోపాధి కోసం బాలు ఒక క్రికెట్ క్లబ్‌లో మైదాన సంరక్షకుడిగా, బంతులు ఏరుకునే పనివాడిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఆటగాళ్లు సాధన చేస్తున్నప్పుడు వారిని గమనిస్తూ, ఖాళీ సమయాల్లో తానే స్వయంగా సాధన చేసేవారు. ఆయనలోని ప్రతిభను కొందరు గుర్తించి బౌలింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు.

లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్‌గా బాలు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆయన బౌలింగ్‌లో ఉన్న కచ్చి తత్వం, వేగం, మలుపులు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఇబ్బందులకు గురిచేసేవి. కొద్ది కాలం లోనే ఆయన పూణే, బొంబాయి ప్రాంతా ల్లో ప్రసిద్ధి చెందారు. అనంతరం ఆయన హిందూ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఆయనకు జట్టులో చోటు దక్కినా కుల వివక్ష మాత్రం తగ్గలేదు.

ఆ రోజుల్లో బాలు ఇతర ఆటగాళ్లతో కలిసి కూర్చుని భోజనం చేయడానికి అనుమతించేవారు కాదు. ఆయనకు ప్రత్యేకంగా టీ గ్లాస్ ఇచ్చేవారు. ఇతర ఆటగాళ్లు ఉపయోగించే పాత్రలను ఆయన ఉపయోగించడా నికి కూడా అనుమతి ఉండేది కాదు. మైదానంలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, సామాజికంగా ఆయనను అంటరానివాడిగా చూసేవారు.

అయినప్పటికీ బాలు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తన ప్రతిభతోనే సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో ముందుకుసాగారు. 1906లో జరిగిన హిం దూ యూరోపియన్ మ్యాచ్‌లో బాలు అ ద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన బౌలింగ్‌పై ఇంగ్లీష్ ఆటగాళ్లు సైతం ప్రశంస లు కురిపించారు. ఆయన కారణంగానే హిం దూ జట్టు అనేక విజయాలను సాధించింది. 

భారత క్రికెట్ చరిత్రలో ఎడమచేతి స్పిన్ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన తొలి ఆటగాళ్లలో బాలు ఒకరు. అయితే, ఆయనకు కెప్టెన్సీ ఇవ్వడంలో కుల వివక్ష అడ్డుపడింది. ప్రతిభ, అనుభవం, సీనియారిటీ ఉన్నప్పటికీ కేవలం దళితుడనే కారణంతో ఆయనను కెప్టెన్‌గా నియమించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక సామాజిక సంస్కర్తలు, రాజకీయ నాయకులు దీనిని ఖండించారు. ఈ సంఘటన భారత సమాజంలో కుల అసమానతలపై పెద్ద చర్చకు దారితీసింది.

పాల్వంకర్ బాలు జీవితం క్రికెట్ క్రీడకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన సామాజిక సమానత్వం కోసం కూడా ఎంతగానో కృషి చేశారు. దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన జీవితం ఎంతో మంది అణగారినవర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పాల్వంకర్ బాలుపై ప్రశంసలు కురిపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా, ప్రతిభకు కులం అడ్డుకాదని నిరూపించిన మహానుభావుడిగా ఆయనను అభివర్ణించారు. అయితే పాల్వంకర్ బాలు పూణే ఒప్పంద విషయంలో అంబేద్కర్ మార్గాన్ని విభేదించి, గాంధీ వెంట నడిచారు. కానీ, అంతిమంగా తన జీవిత చివరి దశలో భారతీయ కుల వ్యవస్థలోని లోపాల మూలంగా అగ్రవర్ణ సమాజం చేతుల్లో వేల సంవత్సరాలుగా భారతీయ చరిత్రలో దళితులకు జరిగిన సామాజిక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వివక్షతలపై సంపూర్ణ అవగాహన లేకుండా, అంబేద్కర్ రాజమార్గంలో ప్రయాణించ లేకపోయినందుకు ఎంతగానో మనోవేదన చెందారు. ఈ క్రమంలోనే ఆయన 1955 జూలై 4న మరణించారు. 

అయితే బాలు చూపిన మార్గం, సాధించిన విజయాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. భారత క్రికెట్లోనే కాకుండా భారత సామాజిక చరిత్రలో కూడా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. బాలు జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రతిభ, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి వివక్షలనైనా అధిగమించి విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, సమానత్వం కోసం నిలబడిన ఈ మహానుభావుడి జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. భారత క్రీడా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

 నేటి ఆధునిక ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ వచ్చినప్పటికీ భారతదేశంలో మాత్రం రోజురోజుకీ కులం తన రూపాన్ని మార్చుకుంటూ గుణాన్ని కోల్పోకుండా ఉంటున్నది. ఆధునిక భారత ప్రభుత్వాలు సచిన్ టెండూల్కర్ భారతీయ క్రీడా రంగానికి చేసిన సేవలను గుర్తించి, ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించాయి. అంతేకాకుండా భారత పార్లమెంట్‌లో మేధావులు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభకి పంపించింది.

కానీ, ఏ ఒక్క రోజు కూడా సచిన్ టెండూల్కర్ దేశంలో ఉన్న పేద ప్రజల గొంతుకగా మాట్లాడిన సందర్భాలు లేకపోవడం బాధాకరం. సచిన్ టెండూల్కర్ కంటే వంద సంవత్సరాల ముందే క్రికెట్ క్రీడా విభాగంలో భారత ఖ్యాతి ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన పాల్వంకర్ బాలు సేవలను ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించడం లేదు. దళితుడైన కారణంగానే అతని పేరు నేడు భారత పౌరులకు తెలియలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పాల్వంకర్ బాలుకి బతికుండగా కాకపోయినా, మరణాంతరం అయినా రావలసిన కీర్తి ప్రతిష్టలు దక్కలేదు. ఆయనకు తగిన గుర్తింపు రాకుండా అడ్డుకున్నదెవరు? దీనికి భారత ప్రభుత్వాలు, పాలకుల దగ్గర సమాధానం ఉన్నదా? పాల్వంకర్ బాలు ఒక దళితుడు అయిన కారణంగానే వారికి రావలసిన గుర్తింపు, గౌరవం నేటికీ రాలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కాబట్టి ఇకనైనా భారత ప్రభుత్వం పాల్వాంకర్ బాలుకి రావల్సిన గుర్తింపు, సామాజిక గౌరవం ఇవ్వాల్సిన చారిత్రక సందర్భం నెలకొన్నది. అప్పుడే పాల్వంకర్ బాలు జీవితాన్ని ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకుంటాడు. సామాజిక రుగ్మతలు, ఆటుపోట్లు తట్టుకొని ఇంకా మరెందరో క్రీడాకారులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. 

సినిమాలలో హీరోలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కన్నీళ్లను తట్టుకొని ఉన్నత స్థాయికి చేరితే, చాలామంది వారిని ఆదర్శంగా తీసుకుంటారు. అంతేకాదు, కష్టన ష్టాలకోర్చి ఎదిగిన క్రీడాకారుల జీవితగాథలు సినిమాలుగా వస్తున్నాయి. కానీ, పాల్వంకర్ బాలు జీవితంపై అలాంటి సినిమాలు నేటి వరకు రాకపోవడం బాధాకరం. భారతీయ క్రీడాభిమానులకు, ప్రతి భారతీయుడికి  పాల్వంకార్ బాలు జీవిత చరిత్రను తెలిపే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

అలా చెప్పినట్లయితే కుల అసమానతలను పారద్రోలి ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను సంరక్షించినట్లు అవుతుంది. కాబట్టి పాల్వాంకర్ బాలు జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా వారి పేరుపై గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెట్టాలి. క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు పెట్టాలి.

అంతేకాదు, భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలి. భారతదేశ క్రికెట్ క్రీడా రంగానికి వారు తెచ్చిన గుర్తింపునకు, చేసిన సేవకి గాను అంతే స్థాయిలో పాల్వాంకర్ బాలుకి కూడా ఉన్నతమైన సామాజిక గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. అదే వారికి ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి.

 వ్యాసకర్త: సామాజిక, రాజకీయ విశ్లేషకులు,

9553041549