ఆదివాసి గర్భిణీని ఒప్పించి... తన వంతు ఆర్థిక సాయం చేసి...
జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ ఉదారత...
ఉట్నూర్, మే 13 (విజయక్రాంతి): రక్తహీనతతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 8 నెలల ఆదివాసీ గర్భిణి కొడప పార్వతి (24) ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ కూడమేత మనోహర్ వైద్యం కోసం ఒప్పించి, స్వయంగా కొంత ఆర్థిక సహాయం అందించి, ఆసుపత్రికి తరలించి గర్భిణీ తో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలను కాపాడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉడుంపూర్ సబ్ సెంటర్ పరిధిలోని కొలం గూడ కు చెందిన కొడప పార్వతి ఎనిమిది నెలల గర్భిణి.
రెండు నెలల క్రితం ప్రసూతి కోసం తల్లి గారి ఊరైన ఇంద్రవెల్లి మండలం మర్కాగూడ కు వచ్చింది. రక్తహీనతతో బాధపడుతూ.. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్నీ ఇంద్రవెల్లి పీఎస్సీ వైద్యురాలు పూజిత గుర్తించారు. 8 నెలల గర్భిణి వైద్యం అందించకుంటే తల్లి బిడ్డలకు ప్రమాదం ఉందని నచ్చ చెప్పిన వారు వినకపోవడంతో ఈ విషయాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో డాక్టర్ మనోహర్ బుధవారం మర్కగూడ గ్రామానికి వెళ్లి రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పార్వతి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ తీసుకువెళ్తే వచ్చే నెలలో ప్రసూతి సక్రమంగా జరుగుతుందని వారికి భరోసా కల్పించారు. కొలం భాషా వచ్చేవారిని పార్వతికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి వైద్యం అందిస్తామని వారికి భరోసా కల్పించడంతో పాటు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో బయట ఖర్చులకోసం తన వంతుగా రూ. 2000 నగదు అందించారు.
ఆసుపత్రిలో ఉన్నంత కాలం బయట ఖర్చుల కోసం పాటు ఇతర ఖర్చులకోసం ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకువెళ్లి డబ్బులు మంజూరయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్వతి తోపాటు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... గత నెలలో రిమ్స్ లో వైద్యం కోసం వెళితే అక్కడి వైద్యులతో పాటు వైద్య సిబ్బంది తమ పట్ల నిర్లక్ష్యం చేయడంతో పాటు కిడ్నీ వ్యాధి ఉందని, ఏడు నెలలకే ప్రసూతి చేసే పంపిస్తామని బెదిరించారని ఎనిమిది నెలల గర్భిణి పార్వతి కన్నీరు మున్నీరై డాక్టర్ మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు.
తన మాటలు నమ్మి వైద్య సు కోసం వస్తే రిమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలసిన రక్తాన్ని సమకూర్చడంతోపాటు కొలం భాషా వచ్చే ఏఎన్‌ఎం లను తోడుగా ఉంచుతానని హామీ ఇవ్వడంతో వైద్యం కోసం ఒప్పుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ చేసిన కృషి ఫలించడంతోపాటు వైద్యం కోసం వస్తానని గర్భిణీ పార్వతీతోపాటు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో ఇంద్రవెల్లి పి.ఎస్.సి వైద్య సిబ్బంది రిమ్స్ ఆసుపత్రి కి తీసుకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేశారు.






