17-02-2026 01:25:31 AM
దిస్పూర్, ఫిబ్రవరి ౧౬: అస్సాంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేన్‌కుమార్ బోరా సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉదయం తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. తాను 32 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించానని, అయినప్పటికీ.. తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని, యావత్ క్యాడర్ విస్మరిస్తున్నదని లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్త బయటకు రాగానే ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేగింది. చివరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, మాజీ కేంద్ర మంత్రి భాన్వర్ జితేంద్ర సింగ్ రంగంలోకి దిగి సరాసరి భూపేన్‌కుమార్ నివాసానికి వెళ్లారు. గంటల తరబడి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. నేతల బుజ్జగింపుల తర్వాత భూపేన్‌కుమార్ శాంతించారు. అనంతరం బయటకు వచ్చి పార్టీ తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామాలపై సీఎం హిమంత బిస్వ శర్మ తనదైన శైలిలో స్పందించారు. భూపేన్‌కుమార్ కాంగ్రెస్‌లో మిగిలిన చివరి హిందూ నేత అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో హిందూ నేతలకు విలువ లేదని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని బాంబ్ పేల్చారు.