అంధకారంలో ఆరోగ్య ఉపకేంద్రం
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 17: సంస్థాన్ నారాయణపురం మండలకేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కనీస సౌకర్యాలు లేక సిబ్బంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేయడంతో అంధకారంలోనే చికిత్స చేయాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు.
కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడంతో బాలింతలు పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆరుబయట వేచి ఉండాల్సిన పరి స్థితి నెలకొంది.మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడంతో పక్కన ఉన్న ప్రాథమిక పాఠశాలలోకి వెళ్లాల్సివస్తుందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం దూరంగా ఉండడంతో ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు వైద్యం అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉపకేంద్రంలో కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించినా తమ సమస్యను పరిష్కరించలేదని ప్రభుత్వాలు మారినా తమ సమస్య లను పట్టించుకోవడం లేదని ఆరోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






