18 June, 2026 | 3:11 AM

నా మార్కెట్ తెలుసుకోవాలనే ఇలా..

18-06-2026 01:49 AM

వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవిప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ముఖ్యపాత్రల్ని పోషించారు.

జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా గురించి హీరో వడ్డే నవీన్ మీడియాతో పంచుకున్న ముచ్చట్లు ఇవీ.. “ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. అందుకే కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా థ్రిల్లింగ్ అంశాలతో నేను కంఫర్ట్ జోన్ దాటి ఈ సినిమా చేశా. వేరే నిర్మాత అయితే కథ మారుస్తారని కాదు కానీ, ఈ కథను నేను నమ్మా. అందుకే ఈ సినిమాకు నేనే నిర్మాతగా మారాల్సి వచ్చింది. నేరుగానే పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు.

కానీ ముందు నా మార్కెట్ ఎంత ఉందో తెలియాలి. పైగా అవతల ఉన్న పెద్ద దర్శకులకు నాతో చేయాలని కూడా ఉండాలి. ముందు నా సినిమా బయటకు వస్తే నా మార్కెట్ తెలుస్తుందని కొత్త దర్శకుడితో కలిసి రీఎంట్రీ ఇస్తున్నా. ప్రేక్షకులు ఊహించే రెగ్యులర్ మూవీలా ఉండదు. కానిస్టేబుల్ త్రిమూర్తులు పాత్రకు తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తా. ఈ పాత్ర ఎంతో వినోదం పంచుతుంది. త్రిమూర్తులు భార్య పాత్రలో రాశీసింగ్ అందరినీ ఆకట్టుకుంటారు. ఇప్పటివరకు మా ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు. ప్రేక్షకులూ మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తారనుకుంటున్నా. సోలో హీరోగానే కొనసాగుతా. కథ నచ్చితే మల్టీస్టారర్, ఓటీటీ ప్రాజెక్టులూ చేస్తా” అని తెలిపారు.